ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

MANGO: ఉలవపాడు మామిడి.. ఏదీ ఆ సందడి!?

ఉలవపాడు మామిడి అంటే రుచికి బ్రాండ్‌. ప్రకాశం జిల్లాలో పండే ఈ పండు సువాసనతోనో నోరూరించేస్తుంది. ఎలాంటి రసాయనాలతో మగ్గపెట్టకుండా.. నేరుగా చెట్టుకే పండిన పంటను మార్కెట్‌ చేయటం వల్లనే ఈ పండు కొనేందుకు దూరప్రాంతాల నుంచి వ్యాపారులు ఉలవపాడు వెళ్తుంటారు. ఈ ఏడాది కరోనా ఆంక్షల కారణంగా అటు వ్యాపారులకూ, ఇటు రైతులకూ.. తీరని నష్టమే మిగిలింది.

corona effect on ulavapadu mango
corona effect on ulavapadu mango

By

Published : Jun 9, 2021, 7:27 AM IST

ఉలవపాడు మామిడి అమ్మకాలపై కరోనా ప్రభావం

ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారికి ఇరువైపులా వేలాది ఎకరాల్లో పండించే ఉలవపాడు మామిడికి మంచి గుర్తింపు ఉంది. ఈ బ్రాండ్‌ పేరు చెబితే ఎంత ధర చెల్లించైనా చాలా మంది కొంటారు. జిల్లాలో తక్కువ అమ్మకాలు జరిగినా.. ఇతర జిల్లాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు పెద్దఎత్తున ఎగుమతి అవుతుంది. ఏటా వందలాదిమంది వ్యాపారులు వచ్చి లారీలు, రైళ్లలో తీసుకెళ్లేవారు. సహజసిద్ధమైన రుచికి మారుపేరు అయిన ఈ బంగినపల్లి మామిడి మాధుర్యాన్ని ఏడాదిలో ఒక్కసారైనా రుచి చూసి ఆస్వాదించాలని చాలా మంది కోరుకుంటారు కాబట్టే.. ఈ రకానికి ఎక్కువ డిమాండ్‌.

గతేడాది కరోనా సంక్షోభాన్నితట్టుకుని నిలబడిన రైతులు, వ్యాపారులు... ఈ ఏడాది కొనేవాళ్లు లేక పూర్తిగా నష్టపోయారు. ఏటా రైతులు, కౌలురైతులు, వ్యాపారులు, తోటయజమానులు లక్షలు సంపాదించేవాళ్లు. సాధారణ మామిడి ధర కన్నా ఇది ఎక్కువ ఉండటమే లాభాలకు కారణం. నేరుగా చెట్టునుంచి పండే పండుకాబట్టి... రెట్టింపు ధర అయినా కొనేందుకు వినియోగదారులు వెనుకాడేవాళ్లుకాదు. ఈ సారి రెండోదశ కరోనా ఆంక్షలతో కొనేవాళ్లు లేక నష్టపోయారు.

గతేడాది ఆంక్షలు ఉన్నా.. టన్ను రూ.65వేల వరకూ విక్రయించారు. ఈ ఏడాది టన్ను రూ.20 వేలకు మించి వెళ్లటం లేదు. జాతీయరహదారిపై ప్రయాణించే వాళ్లకోసం రోడ్డుపక్కనే అమ్ముతున్నప్పటికీ చాలా మంది తక్కువ రేటుకే అడుగుతున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలు కఠినంగా ఉండటం వల్ల.. మామిడి విరగ కాసినా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

దగ్గరలో ఉన్న కొంతమంది తోటల్లోకి వచ్చి పండ్లు కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, ఎగుమతుల విషయంలో ప్రభుత్వం చొరవ చూపి ఆంక్షలు ఎత్తేస్తే... కొంతమేర నష్టాలు పూడ్చుకుంటామని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

వైద్యులపై మహమ్మారి పంజా.. చికిత్సనందిస్తూనే మృత్యుఒడిలోకి!

ABOUT THE AUTHOR

...view details