ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నడిసంద్రంలో మృత్యువుతో పోరాటం - AP Fishermen

నడిసంద్రం... చిమ్మచీకటి... ఓ ప్లాస్టిక్‌ మూతే ఆధారం. దాని సాయంతో ప్రాణాలు నిలుపుకునేందుకు ఇద్దరు మత్స్యకారులు మృత్యువుతో పోరాడారు. 6 గంటలపాటు నరకయాతన అనుభవించారు. ఆశలు వదిలేసుకున్న తరుణంలో అదృష్టవశాత్తు ఓ బోటు వచ్చి వారిని కాపాడింది. చేపల వేటకు వెళ్లిన ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవుకు చెందిన మత్స్యకారులకు ఎదురైన అనుభవమిది.

AP Fishermen struggle in Ocean
నడిసంద్రంలో మృత్యువుతో పోరాటం

By

Published : Mar 3, 2020, 11:31 AM IST

నడిసంద్రంలో మృత్యువుతో పోరాటం

ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవుకు చెందిన మత్స్యకారులు సీహెచ్‌ శ్రీను, పిక్కి రాజు, బాపూజీ, సీహెచ్‌ ప్రసాద్‌ కలసి శనివారం ఉదయం చేపల వేటకు సముద్రంలో 38 కిలోమీటర్ల దూరం వరకు ఫైబర్‌ బోటులో వెళ్లారు. రాత్రి 10.30 సమయంలో నలుగురూ అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు. ఆ సమయంలో వీరి బోటును వేగంగా వచ్చిన చెన్నైకి చెందిన స్పీడ్‌ బోటు బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి రాజు, బాపూజీ సముద్రంలో పడిపోయారు. వీరి పడవకు సంబంధించిన తాడు స్పీడ్‌బోటుకు చిక్కుకుని 4 కిలోమీటర్ల మేర లాక్కుపోయింది.

బిక్కుబిక్కుమంటూ...
తాడును తప్పించి స్పీడ్‌బోటు వారు నిర్లక్ష్యంగా వెళ్లిపోయారు. ఈ ధాటికి నీటిలో పడిపోయిన ఇద్దరూ ప్రాణాలు పోయాయనే అనుకున్నారు. ఈ సమయంలో బోటుకు చెందిన ఓ ప్లాస్టిక్‌ కూలింగ్‌ మూత వారికి కనిపించింది. దాని ఆధారంగా రాత్రి 11 గంటల నుంచి ఆదివారం ఉదయం ఐదింటి వరకు ఈత కొడుతూనే గడిపారు. తిమింగలాలు, షార్క్‌లు తిరిగే ప్రాంతం కావడంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. సహచరుల కోసం ఫైబర్‌బోటులో ఉన్న ఇద్దరు గాలించినప్పటికీ చీకటి కావడం వల్ల నిష్ఫలమే అయింది.

ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న తరుణంలో..
సముద్రంలో చిక్కుకున్నవారు ప్రాణాలపై ఆశలు వదిలేస్తున్న తరుణంలో అటుగా వచ్చిన మన ప్రాంతానికి చెందిన మరో బోటు గమనించి రక్షించింది. ఒడ్డుకు చేర్చేందుకు తీసుకువస్తుండగా, వారి ఫైబర్‌ బోటు కూడా కనిపించింది. అందులో ఉన్న రాజు, బాపూజీ కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులతో పాటు దెబ్బతిన్న బోటును సోమవారం ఉదయానికి ఒడ్డుకు చేర్చారు. బాధిత మత్స్యకారులకు వాడరేవులో ప్రాథమిక చికిత్స చేయించారు.

ఇదీ చదవండీ... ఇళ్ల స్థలాల వేటలో అధికారుల కొత్తబాట..!

ABOUT THE AUTHOR

...view details