ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడ్డా కూలీలుగా మారిన అన్నదాతలు.. రోజువారి పని కోసం అష్టకష్టాలు - Prakasam District local news

Prakasam district Farmers updates: వాళ్లంతా వ్యవసాయమే జీవన ఆధారంగా ముందుకు సాగిన అన్నదాతలు. ఆరుగాలం శ్రమించి మంచి పంటలను పండించిన రైతన్నలు.. ఉన్న ఊరిలోనే కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఆనందంగా జీవనం సాగించిన వారూ.. రానూరానూ వ్యవసాయం చేయడానికి ప్రాజెక్టుల్లో నీళ్లు లేక, భూములు బీటలు బారి నష్టాలను మూటగట్టుకుని అడ్డా కూలీలుగా మారారు. రోజువారి పనుల కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. పనులు లభించక వట్టి చేతులతోనే వెనుదిరుగుతున్నారు. 'ఈటీవీ భారత్' వారిని పలకరించగా కడుపు గోసను పంచుకున్నారు.

Farmers
Farmers

By

Published : Feb 15, 2023, 7:32 PM IST

Farmers as a Labourer: ఆరుగాలం శ్రమించి పంటలను పండించే రైతన్నలు.. రోజువారి కూలీలుగా మారుతున్నారు. సాగు చేసి నష్టాలను మూటగట్టుకొని.. అడ్డా మీద కూలీ కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. ఉన్న ఊళ్లలో జీవనం సాగించలేక.. ఆత్మ గౌరవం చంపుకొని ఆయన వారి ముందు తిరగలేక.. పట్టణాలకు వలస వెళ్తున్నారు. రోజు వారి కూలి పనులు దొరకక ఒక్కొక్కసారి రోజంతా దిగాలుగా కూర్చుని వట్టి చేతులతోనే వెనుదిరుగుతున్నారు. కూలీల కోసం వచ్చే వారి వెంట పడి.. 'మాకు పనివ్వండి..మేము కూడా కూలికి వస్తాము' అంటూ అడ్డా మీద కూలీలను ఆడుకుంటున్నారు. పొలాలు దున్ని హలాలు పండించిన రైతులే ఇలా రోజువారి కూలీలుగా జీవనం సాగించాల్సిన దుస్థితిని తలుచుకుని.. ఆవేదన చెందుతున్నారు. జానెడు పొట్టను నింపుకోవడానికి పడుతున్న పాట్లను గుర్తు చేసుకొని పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోని కనిగిరి, దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో నీటి వసతి లేదు. ఆశలు పెట్టుకున్న వెలిగొండ ప్రాజెక్టు ఏళ్లుగా పూర్తి కాలేదు. ఉన్న ఊళ్లలో పొలాలు ఉన్నా.. నీటి వసతి లేదు. చాలా మంది రైతులు, స్థానికులు ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. కొందరు జిల్లాలోని మార్కాపురం, ఒంగోలు తదితర ప్రాంతాల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, ఉన్న ఊర్లలో భూములు ఉన్నప్పటికీ పంటలు పండించలేక, గిట్టుబాటు ధర కాక.. చాలా మంది రైతులు ఒంగోలు కేంద్రానికి వచ్చి రోజువారి కూలీలుగా మారారు.

ఒంగోలు, కర్నూలు మార్గంలో పైవంతన వద్ద నిత్యం వందలాది మంది కార్మికులు పనుల కోసం నిరీక్షిస్తున్నారు. వేకువజామున నాలుగైదు గంటలకే అక్కడికి వచ్చి.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేచి ఉంటున్నారు. 100 మంది అడ్డాపై ఉంటే.. పని దొరికేది కేవలం 10 మందికే. దీంతో పని దొరకని వాళ్లు ఖాళీ చేతులతో తిరిగి ఇళ్లకెళ్తున్నారు. దాదాపు వెయ్యి మందికి పైగా కార్మికులు వివిధ ప్రాంతాల్లో నిత్యం పనులు కోసం ఎదురుచూస్తుండగా.. ఇందులో దాదాపు 200 మందికి పైగా రైతులే ఉండటం ఆందోళనను కలిగించే అంశం.

అడ్డా కూలీలుగా మారిన ప్రకాశం జిల్లా అన్నదాతలు

భవన నిర్మాణం రంగంలో అనుభవం ఉన్న అడ్డా కూలీలు నిర్మాణానికి సంబంధించి.. ఏదో ఒక పని దొరికినా సంతోషంగా వెళ్తున్నారు. పని దొరకని పక్షంలో నిరుత్సాహంగా ఇళ్లకు వెళ్తున్నారు. కానీ.. ఇప్పటివరకు వ్యవసాయం పనులు తప్పా..మరొకటి తెలియని రైతులు.. ఏ పని అయినా పర్వాలేదు అన్నట్లుగా భవన నిర్మాణం, హోటల్లు, ఇతర షాపుల్లో రోజువారి కూలీలులుగా వెళ్తున్నారు. ఇక రోజువారి కూలీల అడ్డాలో ఈ మధ్య మహిళలు కూడా ఎక్కువగా తరలి వస్తున్నారు. రైతులు ఈరోజున అడ్డా కూలీలుగా మారుతున్న పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడుతున్నాయంటే దానికి పాలకుల పరిపాలన, వారి విధానాలే కారణమంటూ రైతులు కారణాలను ఎత్తి చూపుతున్నారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details