కనిగిరి నియోజకవర్గంలోని 108 వాహనాల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా 108 వాహనాలు అత్యవసర వైద్య సేవలకు దూరమయ్యాయి. నియోజకవర్గంలో మూడు 108 వాహనాలు ఉండగా.. ఒక వాహనం మరమతులకు గురై ఒంగోలు షోరూమ్‌లో రెస్ట్ తీసుకుంటోంది. మరొక వాహనం టైర్లన్నీ అరిగిపోయి నీరసించిపోయింది. ఇక మిగిలిన మూడో వాహనానికి ఆక్సిజన్ సిలిండర్ సరిగాలేక మూలకు చేరింది.
'108 వాహనాలకు మరమ్మతులు చేయండి'
అరిగిపోయిన టైర్లు.. పాడైపోయిన గేర్ బాక్స్... ప్రాణ వాయువు సిలిండర్ లేని స్టాండ్... విరిగిపోయిన స్ట్రెచర్... చిరిగిపోయిన బెడ్.. పనికిరాని వైద్య పరికరాలు... ఇది కనిగిరిలోని 108 వాహనాల పరిస్థితి. అత్యవసర సమయాల్లో ఆదుకోవలసిన 108 వాహనమే.. అత్యవసర మరమ్మత్తులుకు గురైంది.
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు అత్యవసర చికిత్స కోసం 108కి ఫోన్ చేస్తే బాధితులకు ఎదురైన అనుభవాలివి. చివరికి రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన ఓ వ్యక్తి 108 సేవలు అందుబాటులో లేక మరణించాడు. అయినా అధికారుల్లో చలనం లేదు ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి 108 వాహనాలను మరమ్మత్తులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి:కరోనా బాధితుడు 14 రోజుల్లో ఎంతమందిని కలిశాడు.. వారి పరిస్థితి ఏంటి?