నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగు గంగ నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఐదు ఉప కాలువల ద్వారా చెరువులకు ఈ నీరు తాగునీటి అవసరాల కోసం ప్రజలకు అందుతుంది. రాపూరు, దక్కిలి, వెంకటగిరి మండలాల్లోని నాలుగు బ్రాంచ్ కాలువలతో పాటు.. బాలాయపల్లి మండలం ఓట్లపల్లి గ్రామ పరిధిలోని 5 కాలువలకు 200 క్యూసెక్కుల నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు.
నియోజకవర్గంలో తాగునీటి సమస్య పై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఆయన వెంటనే స్పందించారని ఎమ్మెల్యే ఆనం తెలిపారు. బ్రాంచ్ కాలువల ద్వారా చెరువులు సగం నిండే విధంగా తెలుగుగంగ జలాలను విడుదల చేయడానికి అనుమతించడం పట్ల సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తాగునీటి అవసరాలతో పాటు ప్రస్తుతం సాగులో ఉన్న వరి పంటను కాపాడుకోవడానికి నీరు విడుదల చేశామన్నారు. నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్తగా వరి సాగు చేయొద్దని నీటి అవసరాలు తీర్చడం కష్టమని ఎమ్మెల్యే వివరించారు.