ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత.. విద్యార్థులకు తప్పని వెతలు

ఆత్మకూరు మండలం నాగులపాడు ప్రాథమిక పాఠశాలలో 29 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా- ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. అత్యవసర సమయంలో ఆయన సెలవు పెడితే... ఇక బడికి తాళం వేయాల్సిందే. అనంతసాగరం మండలం మినగల్లు ప్రాథమిక పాఠశాలలో 31 మంది చదువుతుండగా- ఇక్కడా ఒక్కరే ఉపాధ్యాయుడు. ఆయన రాకపోతే.. ఈ పాఠశాలలో డిప్యుటేషన్‌ పై పని చేసేందుకు ఇతరులు ముందుకు రావడం లేదు. వాకాడు మండలం పూడిరాయదొరువు ప్రాథమిక పాఠశాలలో 61 మంది విద్యార్థులు ఉండగా- ఇక్కడ పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు ఇటీవల బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఒక్కరూ లేకపోవడంతో.. రోజూ డిప్యుటేషన్‌పై నియమిస్తూ.. బోధన సాగిస్తున్నారు.ఇదీ నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం పాఠశాలల పరిస్థితి.

teachers deficit in primary schools at nellore district
ప్రాథమిక పాఠశాలల్లో వేధిస్తోన్న ఉపాధ్యాయుల కొరత

By

Published : Feb 11, 2021, 3:29 PM IST

భావి భారత భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందన్నది ఎంత సత్యమో... ప్రాథమిక పాఠశాలల్లో నేర్చుకునే అభ్యాసాలే భవిష్యత్తుకు నాంది అన్నదీ అంతే నిజం. అలాంటి ప్రాథమిక విద్యను బోధించే ఉపాధ్యాయుల కొరత నెల్లూరు జిల్లాలో వేధిస్తోంది. కేవలం ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో 918 ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధన సాగుతుండటం పరిస్థితికి అద్దం పడుతుండగా- ఇటీవల జరిగిన బదిలీలతో 69 పాఠశాలల్లో అసలు ఉపాధ్యాయులే లేకుండా పోయారు. నాడు-నేడు పనుల ద్వారా మౌలిక వసతులు సమకూరుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ, ఉపాధ్యాయుల కొరతే తీరకుండా ఉంది.

ప్రతి విద్యా సంవత్సరంలోనూ ఈ సమస్య పునరావృతమవుతున్నా.. అధిగమించే చర్యలు మాత్రం నామమాత్రమే అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై సమీక్షించి.. రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదించాల్సిన అధికారులు ఈ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు నెలకొన్నాయి. సుమారు 1359 మంది ప్రాథమిక ఉపాధ్యాయులు జిల్లాలో అవసరం ఉందని విద్యావేత్తలు చెబుతుండగా- సమస్యను పరిష్కరించాలని నిరసనలు చేపట్టినా ఫలితం లేకపోతోందని ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా సమస్యను అధిగమించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం..

విద్యాహక్కు చట్టం ప్రకారం ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండరాదు. దాని వల్ల విద్యార్థులు విద్యలో వెనుకబడిపోతారని విద్యావేత్తల మాట. కనీసం పాఠశాలలోని విద్యార్థుల సగటును దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు నాలుగు పాఠ్యాంశాలు బోధిస్తారు. అందరిని కలిపి ఒకే చోట ఉంచి ఒక్కో పాఠ్యాంశం బోధిస్తుండంతో ఆయా పాఠ్యాంశాల్లో కొందరు విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. ఒక్కో తరగతిలో 20 నుంచి 50 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. కానీ, ఒకే ఉపాధ్యాయుడితో కానిచ్చేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే మరో 918 మంది ఉపాధ్యాయులు అవసరం. కానీ, ఆ దిశగా చర్యలు కొరవడ్డాయి.

సర్దుబాటు చేస్తున్నాం...

ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నిష్పత్తిని బట్టే ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలో.. ఆయన సెలవు పెడితే.. ఆ స్థానంలో పని సర్దుబాటు కోసం మరో పాఠశాల ఉపాధ్యాయుడిని కేటాయిస్తున్నాం. సమస్య ఏమైనా ఉంటే.. నా దృష్టికి తీసుకురావాలి. - పి.రమేష్‌, జిల్లా విద్యాశాఖాధికారి

కష్టతరంగా ఉంది

విద్యాహక్కు చట్టం ప్రకారం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. కానీ, చాలా పాఠశాలల్లో ఒకరితో సరిపెట్టడంతో బోధన కష్టతరంగా ఉంది. ఇటీవల జరిగిన బదిలీలతో ఈ సమస్య ఇంకా పెరిగింది. డీఎస్సీ ద్వారా త్వరితంగా ఖాళీలు భర్తీ చేయాలి.

- ఎ.సురేంద్రరెడ్డి ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

బోధన కుంటుపడుతోంది...

నాడు-నేడు, విద్యాదీవెన, విద్యాకానుక తదితరాలతో బలోపేతం చేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలి. మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి. పాఠశాలలో ఉన్న ఒకే ఉపాధ్యాయుడు సుమారు 50 మందికి విద్యా బోధన అందించాలంటే కష్టం.

- నవకోటేశ్వరరావు, యూటీఎఫ్‌ నాయకుడు

  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు: 2,724
  • 1 నుంచి 5 తరగతి వరకు విద్యార్థులు: 1,56,984
  • ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నవి: 918
  • అసలు లేనివి: 69
  • అధికారుల నివేదిక ప్రకారం అవసరమున్న ఉపాధ్యాయులు: 1350

ఇదీ చదవండి:

పట్టుచెన్నారులో ఎన్నికలు జరగనివ్వమంటున్న ఒడిశా.. జరిపితీరుతామంటున్న ఏపీ...

ABOUT THE AUTHOR

...view details