నెల్లూరు జిల్లా పులికాట్ తీరానికి 25 రకాలైన విదేశీ పక్షులు వస్తుంటాయి. వందేళ్ల కిందటే వీటి రాక మొదలైంది. అప్పట్లో రైతులే వీటిని సంరక్షించే వారు. తర్వాత మత్స్యకారులూ ఇందులో భాగమయ్యారు. అక్టోబర్లో వలస పక్షుల రాక మొదలవుతుంది. అవి వస్తున్నాయంటే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. అందుకే పంటపై పక్షులు వాలినా.. ఏమీ అనరు.
వందేళ్లకు పైగా పులికాట్ సరస్సుకు వలస పక్షులు వస్తున్నాయి. ముచ్చటగా ఉండే వీటిని చూసేందుకు పర్యటకులు ఎక్కువగా వస్తారు. 2001 నుంచి ప్రభుత్వం ఈ సందర్భాన్ని పక్షుల పండుగగా ప్రకటించింది. ప్రతి ఏడాది జనవరి మొదటి వారంలో మూడు రోజులు ఈ పండుగను నిర్వహిస్తున్నారు.
సైబీరియా నుంచి గ్రే పెలికాన్స్, సౌత్ ఆసియా నుంచి నత్త గుల్ల కొంగ, తెల్ల గుల్ల కొంగ, నైట్ ఎరాన్స్, ఏ గ్రేడ్స్, ఇండియన్ మోర్ హైన్స్, స్పూన్ బెల్స్ వంటి అనేక రకాల పక్షులు పులికాట్కు వస్తుంటాయి. రోజూ 15 కిలో మీటర్ల దూరం తిరిగి ఆహారాన్ని తెచ్చుకుంటాయి. సమీపంలోని చెరువుల దగ్గర ఉన్న చెట్లపై గూళ్లు కట్టుకుంటాయి. సంతానోత్పత్తి చేసుకుని.. మార్చిలో తిరిగి విదేశాలకు వెళ్లిపోతాయి.