జనావాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లేలా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు గోదాములపై... నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని బోడిగాడితోట ప్రాంతంలో కొన్ని గదుల్లో జంతువుల చర్మాలు, ఆవు మాంసంతో వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతం నుంచి దుర్గంధం వెదజల్లుతోందని వాటిని సీజ్ చేశారు.
నగరానికి దగ్గర్లో ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ములు తయారు చేసే పరిశ్రమ, కెమికల్ గోదాము నుంచి విపరీతంగా కాలుష్యం వెలువడుతుంది. ఈ మేరకు పరిశ్రమలను మరో ప్రాంతానికి తరలించాలని అధికారులు సంస్థలకు నోటీసు అందజేశారు. జనావాసాల మధ్య కాలుష్యానికి కారణం అయ్యే వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ హెచ్చరించారు.