Five Persons Died Due to Atisara in Nellore Dirtsrict: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం మండలంలోని పల్లాప్రోలు అతిసారం వల్ల చిగురుటాకులా వణికిపోతోంది. ఈ ఊరిలో మరణాలు ఇంకా ఆగడం లేదు. ఇప్పటి వరకు గ్రామంలో సుమారు 25 మంది అతిసారం బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. కలుషిత ఆహారం కారణమని ఓ వైపు.. ఊరిలో కనీస వసతులు కరవు అవడం, తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
5కి చేరిన మృతుల సంఖ్య: సుమారు 250 కుటుంబాలు నివసించే ఈ గ్రామం(పల్లాప్రోలు)లో ఈ నెల 12న(జులై) గ్రామస్థులకు వాంతులు, విరోచనాలతో బాధపడుతూ మంచం పట్టారు. ఆ క్రమంలోనే ఈ నెల 15న(శనివారం) పోతురాజు లీలమ్మ, 16న(ఆదివారం) అంకయ్య మృతి చెందారు. అతిసారానికి తోడు ఇతర అనారోగ్య సమస్యలతో వేల్పుల తిరుపాలు, 18న(మంగళవారం) ఈదూరు నారాయణ చనిపోయారు. 24వ తేదీ సోమవారం ఈదూరు కాంతమ్మ నెల్లూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో 800 మందికి మించని జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రజలు అతిసారంతో అల్లాడిపోతున్నారు.
పూర్తి నివేదిక వస్తేనే: అతిసారం బారిన పడిన వారికి వైద్య సేవలు అందిస్తున్నామని.. కలుషిత ఆహారమో, మంచినీరో ఇంకా కారణాలు వెల్లడి కాలేదని జొన్నవాడ పీహెచ్సీ అహ్మద్‌బాబు తెలిపారు. ప్రాథమికంగా కలుషిత ఆహారం అని తేలిందని.. పూర్తి నివేదికలు వస్తే అసలు విషయం తెలుస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికి నాలుగు వైద్య బృందాలతో పల్లాప్రోలులో పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఐదుగురు మృతి చెందినా అధికారులకు నిర్లక్ష్యం తగదు: పల్లాప్రోలులో అతిసారంతో ఐదుగురు మృతి చెందినా అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆరోపించారు. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం అతిసారం కేసు నమోదైందని చెప్పారు. పంచాయతీలకు నిధులు లేకుండా చేయడమే దీనికి ప్రధాన కారణమన్నారు. మురుగు కాలువల నుంచి తాగు నీరు వస్తోందన్నారు. వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పట్టించుకోవడంలేదని ఆయన ధ్వజమెత్తారు. వ్యాధి నివారణ చర్యలు చేపట్టి, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
"ఐదుగురు మృతి చెందినా అధికార పార్టీ నాయకులు పట్టించుకోలేదు. పంచాయతీలకు నిధులు లేకుండా చేయడమే దీనికి ప్రధాన కారణం. మురుగు కాలువల నుంచి తాగు నీరు వస్తోంది. వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పట్టించుకోవడంలేదు"-గునుకుల కిషోర్, జనసేన నేత