YCP leader attack on tribal youth: త్రాగునీటి ఎద్దడి గురించి అడిగిన పాపానికి గిరిజన యువకుడిపై వైసీపీ నాయకుడు విరుచుకుపడ్డాడు. నీ అంతు చూస్తానని బెదిరించాడు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని బాధితుడు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. నీటి ఎద్దడి గురించి ప్రశ్నిస్తే బెదిరిస్తారా అని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండంలంలో వేసవికి ముందే నీటి ఎద్దడి నెలకొంది. అయితే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మెప్పు పొందేందుకు అధికార పార్టీ ఎంపీపీ బత్తిన రాములు కుమారుడు, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ డైరెక్టర్ గురవయ్య అసత్యాలు ప్రచారం చేశాడు. అంతేకాకుండా ఇటీవల గ్రామ సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసి.. గండిగనుముల గ్రామంలో నీటి సమస్య లేదని చెప్పాలని గ్రామస్థులను ఆదేశించాడు.
కానీ నీటిఎద్దడిపై శ్రీను నాయక్ అనే యువకుడు స్పందించాడు. గ్రామంలో నీటి సమస్య ఉందని తాను వాట్సాప్లో మెసెజ్ షేర్ చేసినట్లు తెలిపాడు. దీనిపై గురవయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫోన్ చేసి బెదిరించినట్లు శ్రీను నాయక్ వివరించాడు. అంతటితో ఆగకుండా పలువురితో కలిసి దాడికి యత్నించాడన్నారు. బండ్లమోటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు శ్రీను నాయక్ తెలియజేశాడు.