YCP Govt Reverse Gear on Polavaram Project Works:ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. దశాబ్దాల నాటి కల. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సస్యశ్యామలం చేయగల ప్రాజెక్ట్. ప్రజలకు జలధారలు అందించే బహుళార్థసాధకం. గత ప్రభుత్వ హయాంలో 64.22 శాతం పూర్తయిన ప్రాజెక్ట్ పనులు. ప్రభుత్వం మారింది-పోలవరం పరిస్థితి దయానీయంగా తయారైంది. తెలుగు ప్రజల దురదృష్టం కొద్దీ 2019లో రాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్, ఆంధ్రావని ప్రయోజనాలను పక్కకు తోసేసి, అస్మదీయ గుత్తేదారులకు పెద్దపీట వేయడంతో పోలవరం పనులు రివర్స్‌గేర్‌లో కొనసాగుతున్నాయి. దీంతో దశాబ్దాల కల చెదిరి, పోలవరం పనులు నత్తనడకన సాగుతుండడంపై ప్రజలు, రైతులు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
CM Jagan Reverse Tendering on Polavaram: దశాబ్దాల నాటి కల. పాతికశాతం పనులు పూర్తి చేసి ఉంటే, రాష్ట్రంలో ముప్పావు భాగం పచ్చని పైరులతో కళకళలాడేది. మూడు ప్రాంతాలనూ సస్యశ్యామలం చేయగల జీవనాడి పోలవరంలో కాఫర్ డ్యాం గ్యాప్‌లు పూడ్చి, స్పిల్ వేలో మిగిలిన పనులు చేసి ఉంటే, ఈపాటికి తెలుగు నేలపై గోదారమ్మ పరవళ్లు తొక్కుతుండేది. రాష్ట్రం దశ, దిశ పూర్తిగా మారిపోయేది. కానీ, రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన జగన్ రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టి అస్మదీయ గుత్తేదారులకు పెద్దపీట వేశారు. రివర్స్ టెండరింగ్ పేరిట కావాల్సిన వాళ్లకు ప్రాజెక్ట్ పనులు కట్టబెట్టారు. జగన్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్రం మొత్తుకున్నా పట్టించుకోలేదు. దీంతో ప్రాజెక్ట్ పనులు అటకెక్కాయి. కేంద్ర నిపుణుల కమిటీ కూడా పోలవరం ప్రాజెక్టులో అనిశ్చితికి, డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి, ప్రధాన డ్యాం ప్రాంతంలో అగాధాలు ఏర్పడటానికి కారణం మానవ వైఫల్యమే అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్ పేరునే చెప్పింది. అయినా, సీఎం జగన్‌లో మార్పు రాకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.
సొంత జాగీరులా అస్మదీయ కంపెనీలకు ట్రాన్స్‌కో నిధులు దోచిపెడుతున్నారు: లంకా దినకర్
Central Government Fire on CM Jagan:వేగంగా సాగుతున్న పోలవం పనులను జగన్ అర్థాంతంరగా ఆపేశారని, రివర్స్ టెండర్ల పేరుతో దాన్నో ప్రహసనంలా మార్చారని కేంద్రం మండిపడింది. ప్రాజెక్టు కీలక దశలో ఉన్నప్పుడు గుత్తేదారును మారిస్తే ప్రాజెక్టు భవితవ్యం ఏంటంటూ కేంద్రం హెచ్చరించింది. వివరణ కోరినా, వైసీపీ సర్కారు పట్టించుకోలేదు. మొండిగా రివర్స్ టెండర్లు నిర్వహించింది. కేవలం జగన్‌కు కావాల్సిన గుత్తేదారు సంస్థ మేఘా ఒక్కటే టెండరు దాఖలు చేసింది. వారికే పనులు ఇచ్చేసింది. చివరికి కేంద్రం చెప్పినట్లే ప్రాజెక్టు పురోగతి పడకేసింది. గుత్తేదారు మార్పు వల్ల విలువైన సమయం వృథా అయ్యింది. ఎగువ కాఫర్‌డ్యాం గ్యాప్‌లు పూడ్చకపోవడం, దిగువ కాఫర్‌డ్యాం నిర్మించకపోవడంతో భారీ వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట భారీ గోతులు ఏర్పడటంతో పనులు నిలిచిపోయాయి. మానవ వైఫల్యమే దీనికి కారణమంటూ హైదరాబాద్ ఐఐటీ నిపుణుల అధ్యయన కమిటీ తేల్చింది. సకాలంలో ఎగువ కాఫర్‌డ్యాంలో గ్యాప్‌లను పూడ్చలేని అసమర్థతే ప్రాజెక్ట్ దెబ్బతినడానికి కారణమని తేల్చింది.