Illegal Excavations: కోర్టు ఉత్తర్వులనూ పట్టించుకోవడం లేదు.. యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు Illegal Mining in Polavaram Right Canal Areas: ఉమ్మడి కృష్ణా జిల్లా కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం, పోలవరం కుడికాలువ ప్రాంతాల్లో.. కోట్ల రూపాయల విలువ చేసే గ్రావెల్ అక్రమంగా తరలిపోతోంది. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడే లేదు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. పాటించే పరిస్థితి కనపడటం లేదని స్థానికులు చెబుతున్నారు.
కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్‌తో పాటు చుట్టుపక్కల 750 ఎకరాల్లో సుమారు 1000 కోట్ల రూపాయల విలువ చేసే గ్రావెల్‌ను తరలిస్తున్నారని మట్టి తవ్వకాలపై హైకోర్టులో పిటిషన్ వేసిన సమత సైనిక్ దళ్ రాష్ట్రకార్యదర్శి పిల్లి సురేంద్ర ఆరోపిస్తున్నారు. దీనిపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లోనూ ఆయన ఫిర్యాదు చేశారు. ముగ్గురు సభ్యుల బృందం ఏప్రిల్ 8, ఏప్రిల్ 21 న రెండు విడతలుగా తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్ని పరిశీలించారు.
ప్రతీచోటా 10 నుంచి 15 అడుగుల లోతు వరకు మట్టిని తవ్వేశారు. ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో అటవీ, నీటిపారుదల, రెవిన్యూ భూములున్నాయి. తవ్వకాలు జరపాలంటే ఎన్విరాన్ మెంట్, పొల్యూషన్, అటవీశాఖ, ఇరిగేషన్, రెవిన్యూ శాఖల అనుమతులు అవసరం. ఇవేమీ లేకుండానే మట్టి మాఫియా యథేచ్చగా తవ్వకాలు చేస్తోంది.
ఎన్జీటీ బృందం రెండోసారి ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినపుడు మట్టిమాఫియా రెచ్చిపోయింది. తవ్వకాలు జరిగే ప్రాంతాలకు ఎన్జీటీ బృందం వెళ్లకుండా రోడ్డును అడ్డంగా తవ్వేశారు. ముళ్ల కంచెలు అడ్డుపెట్టారు. అయినా కిలోమీటర్ల దూరం కాలినడకన అధికారులు వెళ్లి పరిశీలించారు.
మట్టి తవ్వకాలపై ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని తమకు బెదిరింపులు వస్తున్నాయని సురేంద్ర చెబుతున్నారు. తవ్వకాల వెనుక మంత్రి స్థాయి వ్యక్తులుండమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. రాత్రింబవళ్లు తవ్వకాలు కొనసాగుతున్నాయని.. రోజుకు వందల లారీల మట్టి అక్రమంగా తరలిపోతుందని పిటిషనర్ ఆరోపిస్తున్నారు. దీనిపై.. సీబీఐవిచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరనున్నట్లు చెబుతున్నారు.
"ఇక్కడ మూడు రకాలు ఉన్నాయి. ఒకటి.. పార్టీతో సంబంధం లేకుండా అందరికీ ముడుపులు ఇచ్చుకుంటూ వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. రెండోది ఆఫీసర్లు.. వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. అదే విధంగా రాజకీయ నాయకులు చెప్పినట్లు కూడా వింటున్నారు. ఏం జరిగినా సరే మాకు సంబంధం లేదు అన్నట్లు ఆఫీసర్లు ఉంటున్నారు. తరువాత రాజకీయ నాయకులు.. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఖజానా లేదు అంటున్నారు. మరో వైపు వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతుంది. ఈ డబ్బులను ఎన్నికలకు వాడుకోవాలని చూస్తున్నారు. ఇందులో పెద్దపెద్ద వాళ్లు ఉన్నారు. మంత్రులు, ఆ పైస్థాయి వ్యక్తులు ఇవన్నీ చేస్తున్నారు. దీనిపై ఎన్ని బెదిరింపులు వచ్చినా సిద్ధంగా ఉన్నాము. సుప్రీంకోర్టు వరకూ వెళ్తాం. సీబీఐ విచారణ కూడా కోరుతాం". - పిల్లి సురేంద్ర, పిటిషనర్
ఇవీ చదవండి: