Poor performance of 108 and 104 ambulance call centers: రాష్ట్రంలో 108, 104 అంబులెన్సుల కాల్ సెంటర్ల పనితీరు అంతంత మాత్రంగా ఉంటోంది. ఈ అంబులెన్సులు ఏ సమయంలో ఎక్కడ ఉన్నాయో...ఎటు పోతున్నాయో కూడా తెలపలేని, తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈ కాల్ సెంటర్ల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాహనాల సేవలకు, కాల్ సెంటర్ల నిర్వహణకు విడివిడిగా టెండర్లు పిలిచింది. ఈ కాల్‌సెంటర్ల నిర్వహణకు ఎంపికచేసిన సంస్థకు ప్రతినెలా రూ.1.20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది.
మూడు సంస్థలు కన్సార్టియంగా ఏర్పడి ఈ టెండరు దక్కించుకున్నాయి. ఈ సంస్థ ద్వారా 108 వాహనాలు ఎప్పుడు? ఎక్కడ ఉన్నాయి? ఎంత సమయంలో కాల్ వచ్చిన ప్రాంతానికి పోతున్నాయి? అంబులెన్సులు ఏకకాలంలో ఎన్ని తిరుగుతున్నాయో తెలిపే సాంకేతిక వ్యవస్థ బలహీనంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాల్‌చేసిన వ్యక్తి ఉన్న ప్రాంత వివరాలు సైతం కాల్‌సెంటర్‌లోని సిస్టమ్‌పై సక్రమంగా కనిపించడంలేదని తెలిపాయి. దీనివల్ల ఆయా ప్రాంతాలకు సరైన సమయానికి వాహనం వెళ్లడంలో అవరోధాలు తలెత్తుతున్నాయని అధికారులు గుర్తించారు. 108 అంబులెన్సుల్లో కాలం చెల్లిన వాహనాలను ఇప్పటివరకు మార్చలేదు.