MINISTER BOTSA MEETING WITH TEACHERS UNIONS : ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై విజయవాడ పటమట సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. దాదాపు 52 సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఉపాధ్యాయులు వినియోగిస్తున్న యాప్‌లు, అధికారుల పర్యవేక్షణతో ఉపాధ్యాయులు మానసిక అవేదన చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలను తనిఖీలు చేసి తప్పులు ఉంటే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు తప్పు చేస్తే చర్యలు తీసుకోండి కానీ తనిఖీల పేరుతో మానసికంగా ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు.
నేటి నుంచి విద్యార్థులకు అమలు చేయనున్న రాగి జావను ఉదయం 8 గంటలకు కాకుండా విరామ సమయంలో విద్యార్ధులకు ఇవ్వాలని మంత్రికి సూచించామమని.. అందుకు ఆయన అంగీకరించారని.. ఈ విషయంలో ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మున్సిపల్ పాఠశాల్లో 12 వేల మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారని, వారికి ట్రాప్ట్ రూల్స్‌ను అమలు చేయాలన్నారు. వేసవి సెలవుల లోపు మండల, జిల్లా పరిషత్ పాఠశాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతలు కల్పించాలని కోరారు.
"ఉన్నతాధికారులు పర్యవేక్షణ నేపథ్యంలో పాఠశాలలకు వచ్చి తనిఖీలు చేసి షోకాజ్ నోటీసులివ్వడం తగదని మంత్రికి చెప్పాం. ఉపాధ్యాయుల లోపాలు ఉంటే సూచనలు చేయమన్నాం. ఆ సూచనలకు అనుగుణంగా మేము సరిదిద్దుకోవడానికి అవకాశం అడిగాం"-సాయి శ్రీనివాస్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు