ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాబోయే రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన.. ఆందోళనలో రైతన్నలు - Andhra Pradesh

Rains Losses : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజులు కూడా వర్ష సూచన ఉందని వాతావారణ కేంద్రం తెలిపింది. ఈ వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. తిరుమలలో కురిసిన భారీ వర్షానికి వేసవి నుంచి ఉపశమనం లభించినట్లైంది.

heavy Rains
heavy Rains

By

Published : Mar 17, 2023, 9:35 PM IST

రాష్ట్రంలో విస్తారంగా అకాల వర్షాలు.. పంటలు నష్టపోయిన రైతన్నలు

Heavy Rains In Andhra Pradesh : రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీన పడిందని.. సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఇది కొనసాగుతోందని తెలిపింది. దక్షిణ తమిళనాడు నుంచి మధ్యప్రదేశ్ వరకు రాయలసీమ, తెలంగాణ, విదర్భల మీదుగా కొనసాగుతుందని వివరించింది.

రాబోయే మూడు రోజుల వాతావరణం :ఉత్తర, దక్షిణ కోస్తా​ ప్రాంతాలలో రాబోయే రెండు రోజులలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఆవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన జల్లులు కూడా చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వివరించింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

తిరుమలలో భారీ వర్షం :రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో భారీ వర్షం కురిసింది శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో.. శ్రీవారి భక్తులు వేసవి తాపం నుంచి సేద తీరారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు ఆలయ పరిసరాల ప్రాంతాల్లో తడుస్తూ ఆనందిస్తూ కనిపించారు.ఇంకా తిరుమల కొండపై చల్లదనం నెలకొంది

విపత్తుల సంస్థ సలహాలు : రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరించింది. భారీ వర్షాల దృష్ట్యా రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుముల వర్షం పడే సమయాల్లో పొలాల్లో, చెట్ల కింద ఉండకూడదని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని.. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో.., ప.గో. జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కరుస్తాయని వివరించింది.

నంద్యాల, కర్నూలు జిల్లాలో గొర్రెల మృతి: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి దాదాపు 350 గొర్రెలు మృతి చెందాయి. అయితే అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెదల్ల గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు.. ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న తొడిపల్లి, చింతకుంట గ్రామాల పరిసర ప్రాంతాల్లో గొర్రెల మేత కోసం పొలాలను తీసుకున్నారు. దాదాపు పది లక్షల రూపాయలు వెచ్చించి ఈ పొలాలను తీసుకున్నామని.. వర్షం కారణంగా 350 వరకు గొర్రెలు మృతి చెందాయని, తమకు పరిహారం అందించాలని అధికారులను వేడుకున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురిసిన వర్షాలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. రుద్రవరం, చాగలమర్రి, గడివేములు, మిడుతూరు, ఉయ్యాలవాడ, శిరివెళ్ల తదితర మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పంటలు నేలవాలిపోయాయి. కర్నూలు మండలంలోని సూదిరెడ్డి పల్లె, పసుపుల, నూతనపల్లె గ్రామాల్లో మిరప, మునగ, మొక్కజొన్న పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. శిరివెళ్ల మండలంలోని ఇసుకపల్లి గ్రామ శివారులో పిడుగుపాటుకు.. మహాదేవపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఆంజనేయులు సహా 50 గొర్రెలు మృతి చెందాయి. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉయ్యాలవాడ మండలం కొండపల్లి సమీపంలో భారీ వడగళ్ల వర్షానికి 350 గొర్రెలు, ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో వడగళ్ల వానకు 90 గొర్రెలు మృత్యువతాపడ్డాయి.

ఆందోళనలో రైతన్న : బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని చోట్ల అకాల వర్షాల వల్ల వేసవి తాపం నుంచి ప్రజలు సేద తీరుతున్న మరికొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షాల కారణంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా మోపిదేవిలో భారీ వర్షం పడుతోంది, వర్షం కారణంగా మినుము పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోడూరులో కుండపోతగా వర్షం పడుతోంది.

గుంటూరు జిల్లా కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపై ఎక్కడికక్కడ నీరు నిలిచింది. మిర్చి పంటను కోసి కళ్లాల్లో ఎండబెట్టగా వర్షానికి తడిసిపోయాయి. వర్షం నుంచి రక్షించటానికి పరదాలు కప్పినప్పటికి.. వాటి కిందకు నీరు చేరి మిర్చి పంట తడిసిపోయింది. పంటాకు భారీగా పెట్టుబడులు పెట్టామని వర్షం కారణంగా నష్టపోయామని అన్నారు. వర్షం కారణంగా పంటలు తడిసి నాణ్యత దెబ్బతింటుందని పొగాకు, శనగ రైతులు ఆవేదన చెందుతున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉద్యానవన పంటలతో పాటు పొద్దు తిరుగుడు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఈదురగాలులతో కూడిన వడగండ్ల వాన ధాటికి చేతికందే దశలోని పంటలు నేలకొరిగాయి. మండలంలోని సున్నపు గుట్ట తండా, కౌలేపల్లి, నాగిరెడ్డిపల్లి, మొటుకు పల్లి గ్రామాలలోని ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మునగ , బొప్పాయి తోటలు బాగా దెబ్బతిన్నాయి. మునగచెట్లు నేలకు ఒరిగిపోయాయి. బొప్పాయి కాయలు రాలిపోవటమే కాకుండా మొక్కలు దెబ్బతిన్నాయి. మిరప, టమోటా పంటలు దెబ్బతినటంతో వాటిని సాగు చేసిన రైతులు నష్టపోయారు. కదిరి, గాండ్లపెంట, తలుపుల, తనకల్లు మండలాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వల్ల అధిక నష్టం సంభవించింది. దాదాపు 400 ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. అకాల వర్షాల వల్ల నష్టాల పాలైన తమని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గాలి వాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు పట్టణంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వృక్షాలు సైతం నేల కూలాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో యూకలిప్టస్ వృక్షాలు నేలకొరిగాయి. సుభాష్ రోడ్డు ఎన్​వీఆర్ లేఅవుట్ ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గ్రామీణ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలతో పాటు.. టమాటా మామిడి వంటలు గాలివానకు ధ్వంసమయ్యాయి. మదనపల్లి పరిసర ప్రాంతంలో సుమారు 400 ఎకరాల్లో మామిడి పంట నష్టపోయినట్లు రైతులు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మామిడి చెట్లు నెలకొరిగాయి. టమాటా పంట చేతికి అందే సమయంలో.. వడగండ్ల వాన పడి భారీ స్థాయిలో నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశాజనక ధరలు ఉన్న సమయంలో ప్రకృతి విపత్తు ఆర్థిక ఇబ్బందులకు గురి చేసిందని రైతులు వాపోతున్నారు.

చిత్తూరు జిల్లా వి. కోట మండలంలో అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. గాలి ధాటికి ఉద్యానవన పంటలు నేలమట్టమయ్యాయి. లక్షల రూపాయలు అప్పులు చేసి సాగుచేశామని అవి ఇప్పుడు వర్షం కారణంగా ధ్వంసమయ్యాయని రైతులు వాపోతున్నారు. కొమ్మర మడుగు గ్రామంలో వడగళ్ల వాన కారణంగా ఉద్యనవన పంటలు నేలకూలాయని రైతు రైతు లక్ష్మయ్య తెలిపాడు. దీనికి అతను దాదాపు 4 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు అతను తెలిపాడు. కృష్ణాపురం గ్రామానికి చెందిన మరో రైతు అనంత్​కు చెందిన పూలతోట, కోళ్లఫారం ధ్వసమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తనకు 2లక్షల రూపాయల నష్టం చేకూరిందని తెలిపాడు.

పార్వతీపురం మన్యం జిల్లాలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలోని జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కోమరాడ మండలాల్లోని బాసంగి, గిజబ, వెంకటరాజపురం, కళ్లికోట అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజన్సీ ప్రాంతాల్లో జీడీ మామిడి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. అధికారులు పరిశీలించి పంటలకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని ఉప్పు మడుల్లోని ఉప్పు వర్షానికి తడిసిపోయింది. సుమారు వెయ్యి ఎకరాల్లో ఉన్న ఉప్పు వర్షపు నీటిలో తడిచిపోయిందని రైతులు తెలిపారు. నిలువకు ఉంచిన ఐదు వేల బస్తాల ఉప్పు తడిసిపోవటంతో 12 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఉప్పు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం వర్షానికి తడిసిపోయింది. పర్చూరులో కల్లాల్లో ఎండబోసిన మిరప తడిసింది.

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక, చింతూరు, ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో.. ప్రధాన పంటగా మిరప అధికంగా 5వేల ఎకరాల మేర సాగులో ఉంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కల్లాల్లో ఆరబోసిన మిరప తడిసిపోయింది. నారుమడి దశలో గోదావరి వరదలు, భారీ వర్షాలకు అవస్థలు పడ్డారు. ఇటీవల పంట చేతికి అందే సమయంలో తామర పురుగు, రసం పీల్చే పురుగు దాడికి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. చేతికందిన పంట తడిసిపోయి నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ఎకరానికి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

కడప జిల్లాలో కురిసిన వర్షానికి మామిడి పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల ధాటికి మామిడి చెట్లు విరిగిపోయాయి. మామిడి కాయలు, పిందెలు గాలికి రాలిపోయాయి. ప్రతి ఏడాది మార్చిలో మామిడి కాపు దశలో ఈ అకాల వర్షాలు మామిడి రైతులను కుదేలు చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. చేతికి వచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి పంటలకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు వత్సవాయి, జగ్గయ్యపేట మండలాల్లోని మిర్చి రైతులకు నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. అన్నదాతలు పట్టాలు కప్పి కాపాడుకునేందుకు ప్రయత్నించిన ఫలితం దక్కలేదు. గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్ పట్టాలను సరఫరా చేయడం లేదని రైతులు వాపోయారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయలేక పోతున్నామని అన్నదాతలు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాయితీపై పంపిణీ చేసిన పట్టాలను ఇప్పటికీ వినియోగిస్తున్నామని రైతులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టాలు అందజేయాలని వారు కోరుతున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details