Good Friday Celebrations : విజయవాడలోని సెయింట్ పాల్స్ కథెడ్రల్ చర్చి ప్రాంగణం నుంచి బహిరంగ సిలువ ప్రదర్శన నిర్వహించారు. పరిశుద్ధ సిలువ ప్రదర్శనను విజయవాడ కేథలిక్ డయోసిస్ బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ ప్రారంభించారు. సెయింట్ పాల్స్ కథెడ్రల్ నుంచి మారిస్ స్టెల్లా కళాశాల ఆడిటోరియం వరకు సిలువ ప్రదర్శన సాగింది. అందరి బతుకులూ బాగుండాలని, అందరి పాపాలు పోవాలని యేసుక్రీస్తుని క్రైస్తవులు ప్రార్థించారు. యేసు క్రీస్తు మానవులందరి శ్రేయస్సు కోరుకున్నారని క్రైస్తవ మత పెద్దలు అన్నారు. ఈ సిలువ ప్రదర్శన కార్యక్రమంలో మహిళలు యువతీ యువకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
వైఎస్సార్ కడపలో : కడపలో గుడ్ ఫ్రైడేని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ప్రజల కోసం ఏసుక్రీస్తు శిలువపై తన ప్రాణాలను అర్పించిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే పండగలో భాగంగా కడపలో పెద్ద ఎత్తున భక్తులు సిలువ మోస్తూ తమ భక్తిని చాటుకున్నారు. సిలువను మోసేందుకు భక్తులు పోటీపడ్డారు. మహిళా భక్తులు కూడా సిలువను మోశారు. దేవుని పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ సిలువ యాగ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు. ఏసు పాపులను రక్షించుట కోసం సిలువపై మరణం పొందాడని బిషప్ విక్టర్ బాబు అన్నారు. తిరిగి మూడో రోజున ఏసుప్రభు సమాధిలో నుంచి లేస్తారని అప్పుడు ఈస్టర్ పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇరుసు మండలంలో ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవులు పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ప్రార్థన మందిరం నుంచి గ్రామంలోని వీధులలో క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ ప్రదర్శన జరిపారు. అంతకుముందు ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లాలో : ఎన్టీఆర్ జిల్లా మైలవరం క్రైస్తవులు గుడ్ ఫ్రైడే సందర్బంగా సిలువ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక క్రైస్తవులు పవిత్ర సిలువని పురవిధుల్లో ఊరేగింపు చేసి భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పలు క్రైస్తవ ఆరాధనా సంఘాల సభ్యులు, క్రైస్తవ సోదర, సోదరిమణులు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. గన్నవరంలో గుడ్ ఫ్రైడేని నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో బహిరంగ సిలువ మార్గం నిర్వహించారు. పట్టణంతో పాటు చెన్నై - కోల్కతా హైవే మీదుగా క్రీస్తు మరణ ఘట్టాలను ప్రదర్శించారు. ఫాదర్ పసల థామస్ ఆధ్వర్యంలో భారీగా పాల్గొన్నారు. తేలప్రోలు, కొండపావులూరు, కేసరపల్లి, అజ్జంపూడి, ముస్తాబాదలో ఆకట్టుకున్న శుభ శుక్రవారం ప్రార్ధనలు నిర్వహించారు.