Crop Loss Enumeration in AP: మొన్నటి వరకూ కరవు కాటు- ఇప్పుడు తుపాను పోటు రాష్ట్రంలోని రైతన్నను నిలువునా ముంచేశాయి. మిగ్‌జాం తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న సహా ఉద్యాన పంటలైన అరటి, చెరకు, బొప్పాయి తోటలు కూడా ధ్వంసమయ్యాయి. ముందుగా నీట మునిగిన పొలాల నుంచి నీటిని తోడేందుకు ప్రాధాన్యమిస్తామని చెప్పుకొస్తున్న ప్రభుత్వం మరో నాలుగు రోజుల తర్వాత పంట నష్టం అంచనా ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది.
రైతన్న ఇంట కన్నీరును మిగిల్చిన తుపాను - లక్షలాది ఎకరాలు వర్షార్పణం
మిగ్‌జాం తుపాను సృష్టించిన విధ్వంసం రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లోని పంటల్ని తుడిచిపెట్టేసింది. దాదాపుగా 10 లక్షల ఎకరాల మేర పంటలు ఈదురుగాలులు, వర్షాలకు ధ్వంసమైనట్లు ప్రాథమిక అంచనా. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం ఎన్యూమరేషన్ ప్రక్రియను మరో నాలుగు రోజుల తర్వాత ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ లోగా నీట మునిగిన పంట పొలాల నుంచి నీటిని పూర్తిగా తోడించేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
వరిచేల నుంచి నీటిని పూర్తిగా తోడిన అనంతరం కోత కోసిన పంటరంగు మారకుండా స్ప్రేయింగ్, అలాగే మొలకలు రాకుండా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల ఎకరాల్లోని వరి, మిర్చి వంటి పంటలు, అరటి, బొప్పాయి లాంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.