AP Cabinet Ministers have not received invitations: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం వైభవంగా ప్రారంభమైంది. ఈ మహాయజ్ఞంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొని.. జగన్ సంకల్ప దీక్ష తీసుకున్నారు. అనంతరం రాజశ్యామల అమ్మవారికి పూజలు చేసి.. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసి.. కపిల గోవుకు హారతి ఇచ్చి, అఖండ దీపారాధనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారేందుకు, రాష్ట్ర ప్రజలందరికీ.. ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కోసం, లోక కళ్యాణార్థం కోసం ఈ మహా యజ్ఞం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మహాయజ్ఞం.. నేటి నుంచి మే 17వ తేదీ వరకు (6 రోజుల పాటు) కొనసాగనుంది.
దేవాదాయశాఖపై మంత్రులు అసహనం.. అయితే, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమైన అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు మంత్రులు జోగి రమేష్, తానేటి వనిత, ఉషశ్రీ చరణ్‌లు తప్ప ఇతర శాఖల మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరు హాజరుకాకపోవడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర అభివృద్ది కోసం, ప్రజల ఆయురారోగ్యాల కోసం, లోక కళ్యాణార్థం కోసం చేస్తున్న ఈ మహా యజ్ఞానికి.. మంత్రులకు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందకపోవడంపై దేవాదాయశాఖ మంత్రి, ఆ శాఖ అధికారులపై కేబినెట్ మంత్రులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని చర్చ జరుగుతోంది. మరీ ఎందుకు మంత్రులకు ఆహ్వానాలు అందలేదు..?, దేవాదాయ శాఖ మంత్రి, అధికారులపై వస్తున్న ఆరోపణలు ఏంటీ.? అనే వివరాల్లోకి వెళ్తే.. కీలక విషయాలు తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది.
మంత్రులకు, ప్రజాప్రతినిధులకు అందని ఆహ్వానాలు.. రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తొలి ధార్మిక కార్యక్రమానికి మంత్రులకు, ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు అందలేదు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అంటూ ఈరోజు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర రాజశ్యామల సుదర్శన శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని దేవాదాయశాఖ చేపట్టింది. ఈ మహాయజ్ఞానికి దాదాపు రూ.5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించారు. ఈ క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం.. మంత్రులకు, ప్రజాప్రతినిధులకు మాత్రం ఆహ్వానం అందకపోవటంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంలో దేవాదాయశాఖ మంత్రి, ఆ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రుల్లో చర్చ జరుగుతోంది.
వైభవంగా శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం..హాజరుకాని కేబినెట్ మంత్రులు.. రూ.5 కోట్ల ప్రజాధనంతో మహాయజ్ఞం.. ప్రజాధనంతో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్నారంటూ ఇప్పటికే ఆరోపణలు రేగుతున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా మరో వివాదం దేవాదాయ శాఖను చుట్టుముట్టింది. ప్రోటోకాల్ ప్రకారం.. మంత్రులు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం లేకపోవటంతో మంత్రులెవరూ తొలిరోజు కార్యక్రమానికి హాజరు కాలేదు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం-దేవాదాయశాఖ నిర్వహణలో జరుగుతున్న తొలి ధార్మిక కార్యక్రమం కావటం, రూ.5 కోట్ల రూపాయల ప్రజాధనంతో ఈ యజ్ఞం నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ప్రోటోకాల్ ప్రకారం కేబినెట్ మంత్రులందరికీ ఆహ్వానం పలకాల్సి ఉంది.. లేదా స్వయంగా మంత్రే వెళ్లి వారిని కలిసి ఆహ్వానించాలి.. అలా కుదరని పక్షంలో కనీసం ఆహ్వాన పత్రాలైనా మంత్రుల కార్యాలయాలకు అందజేయాలి. ఈ యజ్ఞానికి ఎవరికీ ఆహ్వానం అందకపోవటంతో నలుగురు మంత్రులు మినహా మరెవరూ హాజరు కాలేదు. మంత్రుల కార్యాలయాలకు, ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు అందకపోవటంపై మంత్రులు కినుక వహించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మంత్రుల మధ్య చర్చకూ దారితీసినట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి