NTR Health University: ఎన్టీఆర్ పోయి.. వైఎస్సార్ వచ్చే.. రాష్ట్రంలో ఎంతో కీలకమైన విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చేందుకు రాత్రికి రాత్రే ఆన్‌లైన్‌లో ఆమోదించిన కేబినెట్. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మార్పు చేస్తూ నేడు ఆసెంబ్లీలో ప్రభుత్వం సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. నాడు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉందని ప్రకటించిన జగన్.. ఆయన పేరుతో జిల్లా పెట్టామంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు వర్సిటీలో పేరు మాయం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వైద్య వర్సిటీతో ఎన్టీఆర్‌కు బలమైన బంధం ఉంది. వర్సిటీ ఏర్పాటు నుంచి జాతీయ స్థాయి గుర్తింపు వరకు ఆయన కృషి ఉంది. మరణానంతరం తర్వాత పాలకులు వర్సిటీకి ఆయన పేరు పెట్టారు. సీఎంలు మారినా 24 ఏళ్లుగా అదే కీర్తి కొనసాగుతోంది. వైఎస్‌కు ఏ సంబంధమూ లేకున్నా ఆయన పేరు పెట్టాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ అని, దీనికి గుర్తింపు తీసుకొచ్చిందీ ఎన్టీఆర్ అని అంటున్నారు. ఇప్పుడు ఆయన పేరుకే వైసీపీ సర్కారు మంగళం పాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ పేరు పెట్టేందుకు రాత్రికి రాత్రే చకచకా ఏర్పాట్లు చేసింది జగన్ ప్రభుత్వం.