Agriculture Principal Secretary comments: ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజులుగా అకాల వర్షాలు భారీగా కురుస్తున్న విషయం విదితమే. వర్షాల కారణంగా ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికొస్తే.. తమ అప్పులు, బాధలు తీరుతాయని ఆశగా ఎదురుచూసిన అన్నదాతలకు ఆవేదనే మిగిలింది. అకాల వర్షాల కారణంగా పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిని, వర్షం నీటితో పొలాలన్నీ నిండిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో కోతలు కోసి కల్లాల్లో ధాన్నాన్ని అరబెట్టగా.. వర్షం రాకతో ఆ ధాన్యమంతా తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఏం చేయాలో అర్థంకాక అయోమాయంలో పడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. నష్టపరిహారాన్ని చెల్లించకపోతే, తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ కన్నీరుమున్నీరయ్యారు.
ప్రభుత్వ నిబంధనలు మేరకే నష్ట పరిహారం.. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది స్పందించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు ప్రభుత్వ నిబంధనలు మేరకే నష్ట పరిహారాన్ని ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా, వర్షాలు ఆగిన తర్వాత సర్వే చేపట్టి.. పంట నష్టం అంచనాలను పూర్తి చేస్తామన్నారు. వాతావరణ సూచనల మేరకు.. ఈ నెల 8వ తేదీ వరకూ వర్షాలు పడే అవకాశం ఉన్నందున 10వ తేదీ తర్వాతే సర్వే ప్రక్రియ చేపడతామన్నారు.
కోత కోయని పంటలకే నష్ట పరిహారం.. జి.కె.ద్వివేది మీడియాతో మాట్లాడుతూ..''రైతులకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాకు ఆదేశాలు ఇచ్చారు. వర్షాలు, రైతుల సమస్యలపై సీఎం జగన్ బుధవారం రోజున మాతో సమీక్షించారు. వ్యవసాయశాఖ, సివిల్ సప్లై, మార్కెటింగ్‌శాఖలకు పలు సూచలను, ఆదేశాలిచ్చారు. ఫీల్డ్‌కు ఎవరూ వెళ్లడం లేదు, సర్వే చేయడం లేదనడం సరికాదు. వర్షాలు పడుతున్నప్పుడు సర్వే చేయడం కుదరదు. వర్షాలు తగ్గిన తర్వాత సర్వే చేసి ప్రతీ రైతు నుంచి నష్టం అంచనాలను సేకరిస్తాం. పంటనష్టం అంచనాలను పూర్తి కావాలంటే వర్షాలు ఆగిన తర్వాత.. 15 రోజులు పడుతుంది. కోత కోయని పంటలకు మాత్రమే నష్ట పరిహారం చెల్లింపులు ఉంటాయి. కోత కోసిన పంటలకు నష్టం పరిహారం అంచనా వేయలేము. కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ శాస్త్రవేత్తలు సలహాల మేరకే నష్టం అంచనాలను చేపడతాం. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఏ విధంగా నష్ట నివారణ చేయాలో రైతులకు చెబుతాం. మొక్కజొన్న కోనుగోలు కేంద్రాలను (మార్క్ ఫెడ్) ఇవాల్టి నుంచే ప్రారంభించాం'' అని ఆయన అన్నారు.
నష్ట పరిహారం అందిస్తున్నాం..ఆ తర్వాత వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి మాసంలో కూడా ఇదే విధంగా అకాల వర్షాలు అనుకోకుండా పడి.. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం జరిగిందన్నారు. అకాల వర్షాల కారణంగా రైతులు పండించిన పంటలు 17,820 హెక్టార్లు దెబ్బతిన్నాయన్నారు. దీంతోపాటు ఉద్యాన పంటలు 5652 హెక్టార్లు దెబ్బతిన్నాయని వెల్లిడించారు. మార్చి నెలలో దెబ్బతిన్న పంటలకు రూ.34 కోట్ల 22 లక్షలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామన్నారు. ఏ సీజన్‌లో దెబ్బతిన్న పంటలకు ఆ సీజన్‌లోనే పరిహారం అందిస్తున్నామన్నారు.
ఇవీ చదవండి