CM Jagan Review on Housing: రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం నిర్మిస్తోన్న ప్రతి ఇళ్లు అత్యంత నాణ్యమైనదిగా నిర్మించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల వల్ల పంపిణీ ఆగినచోట కాకుండా మరోచోట ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు తీసుకుని.. పంపిణీ చేయాలని నిర్దేశించారు. మార్చి నాటికి పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం కింద చేపట్టిన 5 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గృహ నిర్మాణ శాఖపై ఈరోజు జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో పలు కీలక విషయాలపై సుదీర్ఘమైన చర్చ చేశారు.
2.75 లక్షల ఇళ్లు పూర్తి: సొంత ఇల్లు పేదవాడి కల అని.. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి, పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకూ సుమారుగా 2.75 లక్షల ఇళ్లను పూర్తి చేశామని.. డిసెంబరు నుంచి ఇళ్ల నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టనున్నామని అధికారులు తెలిపారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతను పరీక్షించేందుకు మొత్తంగా 36 ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత, వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలని సీఎం సూచించారు.
భూ సేకరణ కోసం అన్ని చర్యలు తీసుకోెండి: లేఔట్లు పూర్తి అవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగాలని సీఎం ఆదేశించారు. కోర్టు కేసుల కారణంగా ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని రెండు లేఔవుట్లకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను ఎంపిక చేశామని అధికారులు వెల్లడించారు. సుమారు 30వేల మందికి ఇళ్ల నిర్మాణం కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగిందని, వారికి త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని సీఎంకు వివరించారు. పూర్తయిన ఇళ్లకు 15 రోజుల్లోగా విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. ఇళ్ల నిర్మాణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకూ రూ.7,630 కోట్లు ఖర్చు చేశామని.. ప్రత్యామ్నాయ భూముల విషయంలో అసవరమైన భూసేకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.