యోగాలో మేటి.. లేరు ఎవరు పోటీ కర్నూలుకు చెందిన లలనప్రియ యోగా పోటీల్లో సత్తా చాటుతోంది. తన ఆసనాలతో అందరిని అబ్బురపరుస్తూ పతకాలను సొంతం చేసుకుంటోంది. వ్యాయామ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో మూడో తరగతి చదువుతున్నప్పుడే యోగా రంగంలో ఓనమాలు దిద్ది ఇప్పటి వరకు పలు పోటీల్లో 20కి పైగా పతకాలను సొంతం చేసుకుంది.
కర్నూలు నగరంలోని కల్లూరు ఎస్టేట్ ప్రాంతానికి చెందిన రామకృష్ణ, మాధురి మొదటి సంతానమే లలనప్రియ. చిన్నప్పుడు చదువులో వెనుకబడినా యోగాపై ఆసక్తి కనబరిచేది. ఈమె ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయుడు... జిల్లా స్థాయి యోగా పోటీలకు తీసుకువెళ్లేవారు. ఈ పోటీల్లో పతకాలు సాధించి...రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అక్కడా... మొదటి, ద్వితీయ బహుమతులు సొంతం చేసుకున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో 20... జాతీయ స్థాయిలో 2 పతకాలు సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లి... తన సత్తా చాటాలని భావిస్తున్నారు లలన ప్రియ. యోగాలో పతకాలు సాధించడమే కాకుండా విద్యలోనూ రాణిస్తోంది ఈ యువతి. యోగా సాధనతో చదువుపై ఏకాగ్రత పెరిగి మంచి మార్కులు సాధిస్తోంది. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న లలన... పదో తరగతిలో 9.5.... ఇంటర్ మొదటి సంవత్సరంలో 9 పాయింట్లతో సత్తా చాటింది.
యోగా దినోత్సవం రోజు... కర్నూలులో ఈమె ఆసనాలనే నగరవాసులందరూ అనుసరిస్తారు అంటే అతిశయోక్తి కాదు. భవిష్యత్తులో పోలీసు అధికారి కావడమే తన లక్ష్యమంటోంది లలన. చిన్నారుల ప్రతిభను గుర్తించి... వారిని ప్రోత్సహిస్తే... అద్భుత విజయాలు సాధించవచ్చని నిరూపిస్తోంది లలన ప్రియ.