బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు తెలంగాణకు వెళ్లగా.. నజీర్ అనే వ్యక్తి ఇంట్లో ఉంచిన రూ.17 లక్షలను దొంగలు అపహరించారు. కర్నూలు జిల్లా గూడూరులోని కోటవీధిలో ఈ ఘటన జరిగింది. ఈనెల 15న ఊరువెళ్లి, 18న తిరిగి ఇంటికి వచ్చి చూడగా.. తాళం పగలగొట్టి ఉందని, నగదు కనిపించడంలేదని బాధితులు తెలిపారు.
స్థలాన్ని అమ్మిన డబ్బు ఇంట్లో ఉంచగా.. వాటిని దొంగలు దోచుకున్నట్లు బాధితులు వాపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ శ్రీధర్, ఎస్సై నాగార్జున, క్లూస్ బృందం ఇంట్లో తనిఖీలు నిర్వహించి, ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.