ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 17, 2021, 5:38 PM IST

ETV Bharat / state

'కుడా'లో నిధులున్నా.. అభివృద్ధి శూన్యం

కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంటు అథారిటీ (కుడా)పై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. దీని పరిధిలో అభివృద్ధి పూర్తిగా కరవైంది. అవసరమైన నిధులు ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. పాలకవర్గం లేకపోవడం.. అవసరమైన పోస్టులను భర్తీ చేయకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. చివరికి అసలు సంస్థ ఉందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది.

no development in kuda
కుడాలో అభివృద్ధికి ముందుకు పడని అడుగులు

కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని 2017, మార్చి 24న ఏర్పాటు చేశారు. దీని పరిధిలో కర్నూలు నగరంతోపాటు డోన్‌, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల మున్సిపాలిటీ, నంద్యాల మండలంలో 5 గ్రామాలు కలిపి మొత్తం 35 మండలాలు వస్తాయి. గత ప్రభుత్వ హయాంలో ఛైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, అప్పటి జేసీ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించి పలు ప్రణాళికలు తయారుచేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛైర్మన్‌ పదవిని భర్తీ చేయలేదు. మరోవైపు అకౌంట్స్‌ అధికారి, మున్సిపల్‌ ఇంజినీరు (ఈఈ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేవు. వైస్‌ ఛైర్మన్‌ పోస్టునూ గతేడాది అక్టోబర్‌లో భర్తీ చేశారు.

కోట్ల నిధులున్నా నీరసమే...

వివిధ రాష్ట్రాల్లోని పలు అర్బన్‌ అథారిటీలు విజయవంతం కావడానికి ప్రణాళికలే ప్రధాన ఆయుధాలు. తిరుపతి ‘తుడా దీనికి తార్కాణంగా నిలుస్తోంది. కమిటీ సభ్యులను తిరుపతి, దిల్లీ, చండీగడ్‌, రాజస్థాన్‌, ముంబయి, అహ్మదాబాద్‌ తదితర ప్రాంతాలకు పంపి గతంలో అవగాహన కల్పించారు. ప్రస్తుతం కుడా బడ్జెట్‌లో రూ.6.50 కోట్లు, పార్కుల అభివృద్ధి కోసం మరో రూ.2 కోట్లు నిధులున్నా.. వాటిని పూర్తిగా ఉపయోగించుకునే దిశగా అడుగులు పడటం లేదు. కర్నూలు, నంద్యాల, డోన్‌ పరిధిలో ఫుట్‌పాత్‌లు, డివైడర్ల (విభాగినుల) మధ్య పూల చెట్లతో కుండీలపై ‘కుడా’ముద్ర వేసి ఏర్పాటు చేశారు. దీనికిగాను గతంలో రూ.25 లక్షలు ఖర్చు చేశారు.

అనధికారిక లే-అవుట్లపై...

కొత్తగా వీసీగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వరరెడ్డి ఇప్పటివరకు రెండుసార్లు ఈవో, ఆర్డీలతో అక్రమ లేఅవుట్లపై సమావేశం నిర్వహించారు. లేఅవుట్‌ రెగ్యులైజేషన్‌ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద గతేడాది డిసెంబరు 31 వరకు గడువు ఇచ్చారు. దీనికిగాను 780 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం వీటి పరిశీలన జరుగుతోంది. ఈనెల 19న జిల్లా రిజిస్ట్రార్‌తోపాటు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులతోనూ సమావేశం నిర్వహించనున్నారు. అనధికార లేఅవుట్లు, సర్వే నంబర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేలా చర్యలు తీసుకోనున్నారు.

ప్లాట్లు వేసి అమ్మేదెన్నడు?

ప్రభుత్వ స్థలాలు తీసుకుని అభివృద్ధి చేసి ‘కుడా’పరిధిలో ప్లాట్లు వేసి అమ్మేందుకు గతంలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. కర్నూలు నగరంలో శిథిలావస్థలో ఉన్న బి.క్యాంపు ఆర్‌అండ్‌బీ గృహాలు, జొహరాపురం డంపింగ్‌యార్డు సమీపంలో స్థలాలు, నంద్యాలలో కొన్ని స్థలాలు అప్పగించాలని జిల్లా ఉన్నతాధికారులకు అప్పట్లో లేఖ రాశారు. నన్నూరు పరిధిలోని కొండను చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేందుకు చర్యలు చేపట్టిన కొద్ది రోజులకే ప్రభుత్వం మారింది. దీంతో గత రెండేళ్లుగా ఇలాంటి ప్రణాళికలకు అడుగులు పడలేదు. ఇది అమలైతే మధ్య తరగతి ప్రజలకు స్థలం కొనుగోలు సులువవుతుందని.. కుడాపై జిల్లా మంత్రులు దృష్టి పెడితే అభివృద్ధి జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

గుడేకల్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

ABOUT THE AUTHOR

...view details