ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలను నడిపించే సారథి ఎవరు..?

పార్టీ కాదు... అభ్యర్థే ముఖ్యం. ఆ మాటకొస్తే అభివృద్ధి చేసే వారికే ఓటు వేస్తాం. ఇదీ.. కర్నూలు జిల్లాలోని నంద్యాల ఓటరు నాడి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఉత్కంఠకు తెరలెపే ఆ స్థానం మరో ఎన్నికల పోరుకు సిద్ధమైంది. తెదేపా - వైకాపా మధ్య హోరాహోరీ ఉన్నా... నిర్ణయాత్మక శక్తినంటూ జనసేన సీన్‌లోకి వచ్చింది. ఇంతకు.. నంద్యాల ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారోనన్న ఆసక్తి నెలకొందిప్పుడు.

నంద్యాల నీదా-నాదా..?

By

Published : Mar 24, 2019, 9:33 AM IST

Updated : Mar 24, 2019, 1:21 PM IST

నంద్యాల నీదా-నాదా..?
నంద్యాల .... ఈ స్థానంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా... అందరికీ ఆసక్తే. రెండేళ్ల క్రితం జరిగిన ఉపఎన్నికలు ఎంతో ఉత్కంఠ రేకిత్తించాయి. పార్టీలను చూసి ఓటేయకుండా... అభ్యర్థుల గుణగణాలు చూసి ఓటు వేయటం అక్కడి ప్రజల ప్రత్యేకం. ఇప్పటి వరకు నంద్యాల గడ్డపై వరుసగా ఏ పార్టీహ్యాట్రిక్ విజయాన్ని కొట్టలేదంటే... ఆ నియోజకవర్గం ఎంత విలక్షణమో అర్థమవుతుంది.

భూమా వర్సెస్ శిల్పా....

2014 ఎన్నికల్లో నంద్యాల స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. అనంతరం ఆయన మరణంతో 2017లో ఉపఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తెదేపా, వైకాపాతో పాటు అన్ని పార్టీలు పోటీలో ఉన్నాయి. నువ్వా - నేనా అన్న తరహా సాగిన ఈ పోరులో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. ఈసారి ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా మరో అదృష్ట పరీక్షకు సిద్ధపడ్డారు. వైకాపా తరపున శిల్పా మెహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్రకిషోర్​రెడ్డి బరిలో ఉన్నారు.

గెలుపుపై ప్రధాన పార్టీల ధీమా..!

కిందటిసారి ఎన్నికల్లో నంద్యాల వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి తెదేపాలో చేరారు. ఎన్నికల వేళ కర్నూలు సీటు ఆశించి భంగపడ్డ ఆయన గాజు గ్లాసు పట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో నంద్యాల వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పామోహన్ రెడ్డి ఈసారి బరిలో నిలవకుండా... కుమారుడు రవిచంద్రకిషోర్ రెడ్డిని బరిలో నిలిపారు. నంద్యాల నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధే మరోసారి సైకిల్ పార్టీ విజయానికి దోహదపడుతందని బ్రహ్మానందరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తెదేపా సర్కార్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని... ఈసారి ప్రజలు తమకే పట్టం కడుతారనే శిల్పా కుటుంబం ముందుకుసాగుతోంది. కొత్తగా వచ్చిన జనసేన ప్రచారంలో జోరు పెంచింది.

విలక్షణమైన తీర్పు ఇస్తారనే పేరున్న నంద్యాల ప్రజలు... ఈ సారి ఎన్నికల్లో సైకిల్​కు పట్టం కడతారా...లేక ఫ్యాన్ పార్టీకి పగ్గాలు అప్పగిస్తారనేది కర్నూలు జిల్లా రాజకీయంలో ఆసక్తికరంగా మారింది.

Last Updated : Mar 24, 2019, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details