ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 29, 2020, 9:11 PM IST

ETV Bharat / state

ఏడాదిన్నరగా.. 'కుడా' అభివృద్ధి ఎక్కడ?

కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) అభివృద్ధి ఏడాదిన్నరగా సరైన ప్రణాళిక లేక అటకెక్కింది. ప్రభుత్వం నిథులు కేటాయించకపోవడం, ఛైర్మెన్, వైస్‌ ఛైర్మెన్ పోస్టుల భర్తీ చేయకపోవటంతో కుడా ఉన్నాట్టా ? లేనట్టా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు జగన్ కేబినెట్​లో ప్రాతినిథ్యం వహిస్తున్నా...దీనిపై దృష్టి సారించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం మారింది....కుడా అభివృద్ధి అటకెక్కింది
ప్రభుత్వం మారింది....కుడా అభివృద్ధి అటకెక్కింది

కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటిని (కుడా) 2017 మార్చి 24న ఏర్పాటు చేశారు. దీని పరిధిలో కర్నూలుతో పాటు డోన్, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల మున్సిపాలిటీ, నంద్యాల మండలంలోని ఐదు గ్రామాలతో కలిపి మొత్తం 35 మండలాలు ఉంటాయి. ఇప్పటికే పలు అర్బన్ అథారిటీలు చేసిన అభివృద్దిపై అవగాహన కల్పించేందుకు గత ప్రభుత్వ హయంలో కమిటీ సభ్యులను తిరుపతి, దిల్లీ, ఛండీగడ్‌, రాజస్థాన్, ముంబయి, అహ్మదబాద్‌ పర్యటనలకు వెళ్లారు.

అక్కడి అభివృద్ధి నమూనాగా తీసుకొని వాటిని కర్నూలులో అమలు చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగానే కేసీ కెనాల్‌పై అయ్యప్ప స్వామి దేవాలయం వెనుకవైపు దుకాణ సముదాయం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేశారు. కానీ అది ఇప్పటికి అమలుకు నోచుకోలేదు.

గత ప్రభుత్వ హయంలో కుడా ఛైర్మెన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. అప్పటి జేసీ ప్రసన్న కుమార్ వైస్‌ ఛైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టి మున్సిపల్ భవనాన్ని లీజుకు తీసుకుని కుడా కార్యాలయం ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ప్రభుత్వానికి నిధులపై ప్రతిపాదనలు పంపగా...10 కోట్లు కేటాయించారు. అందులో 2 కోట్లు మంజూరు కాగా కర్నూలు, నంద్యాల, డోన్‌ పరిధిలలో ఫుట్‌పాత్‌లు, డివైడర్ల మధ్యలో పూల చెట్లతో కూడిన కుండీలను ఏర్పాటు చేశారు. అప్పటికే తొమ్మిది నెలల నుంచి జీతాలు రాక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు మిగిలిన నిధులను సర్దుబాటు చేశారు.

ప్రభుత్వ స్థలాలు అప్పగిస్తే వాటిని అభివృద్ధి చేసి కుడా పరిధిలో ప్లాట్లు వేసి అమ్మేందుకు ప్రత్యేక ప్రణాళిక వేశారు. నన్నూరు పరిధిలోని కొండను చదును చేసి ప్లాట్లుచేసి అమ్మేందుకు చర్యలు చేపట్టే క్రమంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావటంతో అభివృద్ధి ప్రణాళికలు నిలిచిపోయాయి.

ఏడాదిన్నరకు పైగా కుడాపై ప్రభుత్వం దృష్టి సారించకపోవటంతో అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచింది. కుడాలో వీసీగా పని చేసిన విజయ్‌ మనోహర్ నెలన్నర క్రితం పదవీ విరమణ పొందారు. ఈ పోస్టుతో పాటు ఛైర్మెన్‌గా ఇంత వరకు ఎవరినీ నియమించలేదు. పని చేస్తున్న సిబ్బందిలో ఎక్కువ మంది డిప్యూటేషన్ మీద వచ్చిన వారే కావటంతో... అక్రమ లేఅవుట్​లపై ఎవ్వరూ దృష్టిసారించటం లేదు. ఫలితంగా.. గ్రామాల్లో సైతం లేఅవుట్​లు వేసి విక్రయిస్తున్నారు.

ఇదీ చదవండి:

కష్టాలు తీర్చే సింహాద్రి అప్పన్నకు ఆర్థిక సమస్యలు

ABOUT THE AUTHOR

...view details