Siddharameshwara Swamy Temple Strange Ritual: కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలోని పూజారి కాలుతో తన్నితే మోక్షం కలుగుతుందనే అపార నమ్మకం స్థానికులలో ఉంది. ఈ వింత విశ్వాసంతో ఆ గ్రామ ప్రజలు పూజారి తన్నుల కోసం బారులు తీరుతారు. ప్రతి ఏటా ఆచారంగా వచ్చే ఈ సంప్రదాయ ఉత్సవం శనివారం సంబరంగా జరిగింది.
శ్రీ సిద్ధరామేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా చివరి రోజు శివపార్వతులకు ఆలయ ప్రాంగణంలో కల్యాణం జరిపిస్తారు. ప్రతి ఏటా కర్ణాటక రాష్ట్రంలోని హంపీ వీరూపాక్షేశ్వర స్వామి రథోత్సవాలు ఎలా జరుగుతాయో.. చిన్నహోతూరులో కూడా అదే తరహాలో.. మహా యోగి శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి ఉత్సవాలు నిర్వహిస్తారు.
స్థల పురాణం: శివపార్వతుల కల్యాణం సందర్భంలో శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి భక్తులు కొన్ని తప్పులు చేశారు. దీంతో ఆయన కుమారుడు వీరభద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వీరభద్ర స్వామి.. ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిశూలాన్ని తీసుకొని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఆగ్రహంతో నాట్యం చేస్తూ.. భక్తులను తన కాలుతో తన్నుతారని స్థానికులు చెప్తుంటారు.
ఒకే రంగుతో వసంతోత్సవం: వసంతోత్సవం గులాబీ రంగు కలిపిన నీటితో జరిపిస్తారు. స్వామి వారి వసంతోత్సవం ముగిసిన వెంటనే గ్రామస్థులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకున్న పెద్ద గుంతల్లో గులాబీ రంగు కలిపిన నీటిని మొక్కుగా సమర్పిస్తారు. ఆ రంగు నీళ్లతో వసంతోత్సవం సంబరంగా జరుపుకొంటారు. ఏటా జరిగినట్లుగానే ఈ ఏడాది కూడా గ్రామంలోని చిన్నా పెద్దా అంతా కలిసి ఈ ఉత్సవాన్ని సంబరంగా జరుపుకున్నారు. ఇలా గ్రామమంతా ఒకే రంగును వినియోగించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు తెలిపారు.
"పార్వతీ పరమేశ్వర కల్యాణం మా గ్రామంలో సంప్రదాయంగా జరిపిస్తాము. కల్యాణం జరిగిందనే ఆనందంతో ఈ వసంతోత్సవం జరుపుకుంటాము. ఈ వసంతోత్సవంలో స్వామి అమ్మవార్లను పల్లకిలో ఊరేగిస్తాము. మేమంతా గులాబీ రంగు కలిపిన నీళ్లతో ఈ ఉత్సవాన్ని సంబరంగా జరుపుకొంటాము. చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కడా జరగని ఇటువంటి వసంతోత్సవం మా గ్రామంలో మాత్రమే నిర్వహిస్తాము. అలాంటి ఉత్సవాలను మా గ్రామంలో జరుపుకొంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది." - హరి, గ్రామస్థుడు
"శివపార్వతుల కల్యాణ మహోత్సవం సమయంలో ఈ కార్యక్రమాలు, భోజనాలు సరిగా చేయలేదని.. వారి కుమారుడు వీరభద్ర స్వామికి ఆగ్రహం వస్తుంది. దీంతో ఆయన ఉగ్రరూపం దాల్చి.. ఈ కార్యక్రమాలను నిర్వహించింది ఎవరని అందరినీ తరుముకుంటూ వచ్చి గ్రామ పెద్దలను కాలుతో తంతారు. ఈ ఉత్సవంలో వీరభద్రస్వామి పూజారి రూపంలో వచ్చి భక్తులను తంతారు. అలా తన్నటం వల్ల చాలా మంచి జరుగుతుందని మాకు అపార నమ్మకం. గత 500 ఏళ్ల నుంచీ ఈ ఆచారం ఇలాగే కొనసాగుతోంది." - ఆలయ ధర్మ కర్త
ఇవీ చదవండి: