IT Department Notices To Labor Minister Gummanuru Jayaram: కర్నూలు జిల్లా ఆస్పరి మండల పరిధిలో 674/E, 729, 666/2, 668/C, 669/C, 713/A సర్వే నంబర్లలోని 30.83 ఎకరాల భూమి..2020 మార్చి 2న మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యింది. అదేరోజు ఇతర కుటుంబసభ్యులు, బంధువుల పేరుతోనూ 180 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రేణుకమ్మ ఎలాంటి ఆదాయ వనరులు చూపించకపోగా..52.42 లక్షలతో ఎలా కొనుగోలు చేశారన్నది ఐటీ శాఖ అభియోగం.
ఈ భూములను మంత్రి జయరాం కొని, తన భార్యతోపాటు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని గుర్తించిన ఐటీ అధికారులు.. ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నోటీసులకు 90 రోజుల్లో సమాధానం చెప్పాలని..అప్పటి వరకు స్పందించకుంటే ఆ ఆస్తిని మూడో వ్యక్తికి బదలాయించకుండా జప్తు చేసే అధికారం ఉంది అని నోటీసుల్లో పేర్కొంది.
బెంగళూరుకు చెందిన ‘ఇట్టినా ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొన్నేళ్ల క్రితం కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని చిన్నహోతూరు, పెద్దహోతూరు, ఆస్పరి పరిసర రైతుల నుంచి 454.37 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. ఈ కంపెనీ డైరెక్టరు మనుకు చిన్నాన్న వరసైన మంజునాథ్ పలువురికి ఆ భూముల్లో కొంత భాగాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. అలా కొనుగోలు చేసిన వారిలో మంత్రి కుటుంబసభ్యులూ ఉన్నారు.
భూములు అమ్మిన వ్యక్తికి కంపెనీతో సంబంధం లేదంటూ డైరెక్టర్లు ఇట్టినా మను, మోనాలు అప్పట్లోనే ఆలూరు సబ్‌రిజిస్ట్రార్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నకిలీ డాక్యుమెంట్లతో బోర్డు తీర్మానం ఆధారంగా ఆస్తులు అమ్మేశారని, ఆ లావాదేవీలు చెల్లవంటూ ప్రకటన ఇచ్చారు. బెంగళూరులోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ భూములు తన భార్య రేణుకమ్మ, బంధువులు త్రివేణి, ఉమాదేవి, సన్నిహితుడైన అనంత పద్మనాభరావు పేరిట రిజిస్ట్రేషన్ కావడంపై మంత్రి జయరాం గతంలో వివరణ ఇచ్చారు..
ఐటీ శాఖ నోటీసులపై మంత్రి జయరాం స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు రాకున్నా, వచ్చాయని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఒకవేళ ఐటీ అధికారులు అడిగితే ఆధారాలు చూపిస్తామన్నారు. దోపిడీ, దౌర్జన్యం చేయలేదన్నారు. బినామీలు లేరన్నారు. కుటుంబసభ్యుల పేరిట కొన్నమాట నిజమేనని అంగీకరించారు. ఇది బినామీ చట్టం కిందకు రాదన్నారు. న్యాయబద్ధంగా లేకపోతే రిజిస్ట్రేషన్లు ఎలా అవుతాయని ప్రశ్నించారు.
ఇట్టినా’భూములపై 2020లో టీడీపీ ఓ కమిటీ వేసింది. ఎమ్మెల్సీలు బీటెక్ రవి, బీటీ నాయుడు, తెదేపా నేతలు వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆలూరు ఇన్‌ఛార్జి కోట్ల సుజాతమ్మ అప్పట్లో రైతులతో మాట్లాడారు. తాను ఎన్నికల్లో గెలిస్తే ఇట్టినా నుంచి భూములను తిరిగి ఇప్పిస్తానని జయరా చెప్పారన్న రైతులు.. తీరా గెలిచి మంత్రి అయ్యాక ఆయనే కొన్నారంటూ అప్పట్లో కమిటీ ఎదుట వాపోయారు.
ఒకేరోజు కుటుంబసభ్యుల పేరిట 180 ఎకరాలు.. మంత్రి జయరాం దంపతులకు నోటీసులు ఇవీ చదవండి: