ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల తాగు, సాగునీటి వరప్రదాయనిగా వున్న తుంగభద్ర జలాశయం జలకళ సంతరించుకుంది. మరో 24 గంటల్లో తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయిలో వరద నీటితో నిండుతుందని తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపారు. ఏ సమయంలోనైనా టీబీ డ్యాం గేట్లు ఎత్తే అవకాశముందని ప్రకటించారు. డ్యాంలోకి వచ్చే వరద నీటిని తుంగభద్ర నదిలోకి వదులనుండటంతో.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. కర్ణాటకలోని విజయనగర, బళ్లారి, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు జిల్లా కలెక్టర్లు, నీటి పారుదల శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖ ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు.
కర్ణాటకలోని మాలనాడు, మంగళూరు, శివమొగ్గ, ఆగుంబె, భద్రావతి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో గత రెండు రోజులుగా తుంగభద్ర జలాశయనికి భారీగా వరద చేరుతోంది. కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో 2,11,890 క్యూసెక్కులు వరద నీరు కిందకు రావడంతో.. జలాశయం నిండుకుండను తలపిస్తోంది. డ్యాము పూర్తిస్థాయి నీటిమట్టం 1633.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,628.15 అడుగుల మేర నీరుంది. జలాశయానికి 1,43,477 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా.. అవుట్ ఫ్లో 9,331 క్యూసెక్కులుగా ఉంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుంగభద్ర నదిలోకి వదిలిన నీరు.. హోస్పేట, కమలాపూర్, హంపి, బళ్లారి, కాంప్లై, సిరుగుప్ప, కొప్పల్, రాయచూర్, కర్నూల్, ఆదోని, ఎమ్మిగనూరు, మహబూబ్ నగర్, మునిరాబాద్, నంద్యాల, నాగార్జున సాగర్ బ్యాంకు చేరుతాయి.