HC ON AHOBILAM EO BANK ACCOUNT: ఆహోబిలం శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ఈవోను నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఈవో పేరున తెరచిన బ్యాంక్ ఖాతాను హైకోర్టు స్తంభింపజేసింది. ఆహోబిలం మఠం పేరున గతంలో ఉన్న ఖాతానే వినియోగించాలని స్పష్టం చేసింది. ఆ ఖాతాను మఠాధిపతి , ఈవో సంయుక్త ఖాతాగా మార్చి రోజువారి ఖర్చుల కోసం ఇరువురు సంతకాలతో నిధులను వినియోగించాలని పేర్కొంది. నిధులను దేవస్థానం నిర్వహణ కోసమే వినియోగించాలని, ఇతర అవసరాలకు వాడటానికి వీల్లేదని తేల్చి చెప్పింది. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి , కమిషనర్ , అహోబిలం ఈవోకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు వేయాలని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కర్నూలు జిల్లా ఆహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి ఈవోను నియామకాన్ని సవాలు చేస్తూ కేబీ సేతురామన్ హైకోర్టులో పిల్ వేశారు . పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ ఈవో పేరున ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరచి నిబంధనలకు విరుద్ధంగా మఠానికి చెందిన నిధులను అందులో జమ చేస్తున్నారన్నారు. మఠాధిపతి ఖాతాలో జమ చేయడం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం అన్నారు. ఆ వివరాలను పరిణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈవో ఖాతాను స్తంభింపజేేసింది.