కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పొంగుతోంది. కృష్ణా వరదతో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుంటే... కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంత పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇక్కడ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పడిన కొద్దిపాటి చినుకులకు ఖరీప్ సాగు ఆలస్యంగా ప్రారంభమైంది. ఇన్నాళ్లూ చినుకు జాడ లేక.. సాగు సాధ్యం కాక.. కరవునుంచి బయటపడలేక... కాడెద్దులను అమ్ముకుని రోజులు వెళ్లదీసుకున్న రైతన్నలు.. ఇప్పుడు ఖరీఫ్తు దుక్కి దున్నేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. తమకే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో పశువులను మేపలేక అమ్ముకున్నామని ఆవేదనతో చెప్పారు. ఈ మధ్య పడిన కొద్ది పాటి వర్షాలతో పొలం బాట పట్టిన కర్షకులకు కాడెద్దులు సమస్య వచ్చింది. కిరాయికి ఎద్దులు కావాలంటే రోజుకు 500 రూపాయలు చెల్లించాలి. ఈ భారం భరించలేక భుజాలనే నమ్ముకున్నారు. నాగలి పట్టారు. పుడమి తల్లిని పండించడానికి కర్షకులే కాడెద్దులుగా మారారు. చెమట చిందిస్తూ సాగులో శ్రమిస్తున్నారు.
అన్నదాతే కాడెత్తితే... పుడమి తల్లి పండదా!
తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కర్నూలు జిల్లా పశ్చిమప్రాంతంలో సాగు ఆలస్యంగా మొదలైంది. ఈ మధ్య కురిసిన చిరుజల్లులతో ఖరీఫ్ సాగు ప్రారంభించిన రైతన్నలు.. పొలం దున్నే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిరాయికి ఎద్దులు తెచ్చుకోలేక అన్నదాతలే కాడెద్దులై దుక్కి దున్నరు.
కర్షకులే కాడెద్దులైతే...పుడమి తల్లి పండదా!