AP Crime News: కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. కలపరి గ్రామ శివారులో ఓ వ్యక్తిని దారుణంగా హత్యకు గురయ్యారు. ఆస్పరి మండలం కారుమంచి గ్రామంలో 15 ఏళ్ల క్రితం ఓ హత్య కేసులో ఉన్న హనుమంతు అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా రాళ్లతో కొట్టి, కత్తులతో నరికి హత్య చేశారు. 15 ఏళ్ల క్రితం హత్య కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి నుంచి గ్రామాన్ని విడిచి పెట్టి దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామంలో నివాసం ఉంటున్నారు.
ఆస్తి తగాదా.. ఇద్దరి పరిస్థితి విషమం:ఆస్తి తగాదా నేపథ్యంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. పులివెందుల మండలం రచ్చుమర్రిపల్లెలో ఆస్తి విషయంలో ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు.. ఈ ఘర్షణలో దాదాపు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తలలు పగలడంతో స్థానిక పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. రచ్చుమర్రిపల్లె గ్రామంపై పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం చింతల జుటూరు గ్రామానికి చెందిన వారు దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చి దాడి చేశారని వారు తెలిపారు.
స్నానానికి వెళ్లి బాలుడు మృతి:అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట సమీప పొలాలలో ఉన్న నీటిలో స్నానానికి వెళ్లిన ఓ బాలుడు మృతి చెందాడు. హుకుంపేటకు చెందిన జ్ఞాన దీపక్ పదో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి తన పొలంలో నీళ్లు ఉండడంతో సరదాగా ఈత కొట్టేందుకు మంగళవారం సాయంత్రం ఆ నీటిలో దిగాడు. జాతీయ రహదారి నిర్మిస్తూ ఉండడంతో రహదారికి ఆనుకుని ఉన్న పొలంలో తీసిన గుంతలో నీళ్లు చేరి ఊబిగా మారింది. అది గమనించని దీపక్ అందులో దిగి మునిగిపోయాడు. కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతుండగా మృతదేహం కనిపించింది.
ఆత్మహత్య చేసుకుంటానంటూ హంగామా : తన ఇంట్లో కిరాయికి ఉన్న వారు ఇల్లు ఖాళీ చేయడం లేదంటూ ఇంటి యజమాని మనస్తాపం చెందిన నాలుగంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్చల్ చేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరులో చోటు చేసుకుంది. అతని భార్య సైతం బాత్రూం క్లీనర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో సయ్యద్ వాసీం అక్రం బ్యాంక్ లోన్ తీసుకొని సొంత ఇల్లు నిర్మించుకున్నాడు. ఇంటిని నాలుగు సంవత్సరాల క్రితం ఓ మహిళకు అద్దెకిచ్చాడు. ఆ మహిళ ఇంటి కిరాయి చెల్లించకుండా, ఇల్లు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతోందని వాసీంఅక్రం ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క లోన్ చెల్లించాలంటూ బ్యాంక్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు. ఈ రెండు కారణాల వలన మనస్తాపం చెందిన సయ్యద్ వాసీం అక్రం నాలుగు అంతస్తుల భవనం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హంగామా చేసాడు. అదే సమయంలో అతని భార్య సయ్యద్ ఐశ్రత్ బాత్రూం క్లీనర్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఆమెను కోవూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని అక్రంకు నచ్చజెప్పి కిందకు దించారు.