కరోనా ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీతోపాటు ఇతర వాహనాలు తిరగడం లేదు. జిల్లాలో గత నెల 22వ తేదీ నుంచి కర్నూలు రీజియన్ పరిధిలో 896 బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఫలితంగా ఆర్టీసీకి రూ.24 కోట్ల నష్టం వాటిల్లింది.
ఆర్టీసీ బస్సుల ద్వారా గతంలో రోజుకు రూ.1.20 కోట్ల రాబడి వచ్చేది. మరోవైపు కర్నూలు రీజియన్‌లో కర్నూలుతోపాటు ఇతర పట్టణాల్లోని ఆర్టీసీ బస్సుస్టేషన్లలో 600కు పైగా దుకాణాలున్నాయి. వీటి ద్వారా ఆర్టీసీకి నెలకు రూ.1.10 కోట్ల ఆదాయం వచ్చేది. దుకాణాలన్నీ మూతపడి అటు దుకాణదారులకు, ఇటు ప్రగతి చక్రానికి నష్టం వాటిల్లుతోంది.
రవాణా వసతి లేక..
కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టి లాక్‌డౌన్ ఎప్పుడు తొలగిస్తారా? ఎప్పుడు ఆర్టీసీ బస్సులు తిరుగుతాయా.. అని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికశాతం పల్లెవాసులు పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించేవారు. జిల్లాలో 896 బస్సులుండగా వీటిల్లో 551 వరకు పల్లెవెలుగు బస్సులు రోజుకు 2.60 లక్షల కిలోమీటర్ల వరకు తిరుగుతున్నాయి. కొన్ని రోజులుగా లాక్‌డౌన్ అమలులో ఉన్నందున రవాణా వసతి లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉదయం పూట కొన్ని ప్రాంతాల్లో ఆటోలు తిరుగుతున్నాయి. అత్యవసర పనులున్నవారు ఆటోలను ఆశ్రయిస్తున్నారు.