వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 18 మందికి గాయాలు కర్నూలు జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
డివైడర్ను ఢీకొన్న ఆటో...ఆరుగురికి గాయాలు
కర్నూలు జిల్లా పాణ్యం వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. వెల్దుర్తి మండలం సిద్ధనగట్టు గ్రామం నుంచి బలపనూరుకు కూలీలతో వెళ్తోన్న ఆటో.. పాణ్యం వద్ద వంతెనపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డ ఆరుగురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఆటోను ఢీకొన్న మరో ఆటో...12 మందికి గాయాలు
ఆళ్లగడ్డ పరిధిలోని చింతకొమ్మదిన్నె వద్ద 40వ జాతీయ రహదారిపై ఆటోను వెనుక నుంచి మరో ఆటో ఢీ కొన్న ఘటనలో 12 మంది కూలీలు గాయపడ్డారు. స్థానికులు వీరిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తరలించారు. గాయపడిన వారు రుద్రవరం మండలం నక్కలదిన్నె గ్రామస్థులుగా గుర్తించారు. వీరందరూ చాగలమర్రి మండలంలోని మల్లెవేముల గ్రామంలోని పూలతోటలో కూలి పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...అనంతపురంలో తాగుబోతు వీరంగం...!