ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాప్యిలి ఎంపీడీవో కార్యాలయంలో అనిశా తనిఖీలు

కర్నూలు జిల్లా ప్యాపిలి ఎంపీడీవో కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు చేపట్టారు. మెట్టుపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు అధికారులు ఈ చర్యకు ఉపక్రమించారు.

By

Published : Mar 16, 2021, 4:36 PM IST

పాప్యిలి ఎంపీడీవో కార్యాలయంలో అనిశా తనిఖీలు
పాప్యిలి ఎంపీడీవో కార్యాలయంలో అనిశా తనిఖీలు

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో అవినీతి నిరోధక శాఖ తనిఖీలతో అధికారుల్లో గుబులు పట్టుకుంది. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో అనిశా డీఎస్పీ శివనారాయణస్వామి ఆధ్వర్యంలో సీఐలు తేజేశ్వరరావు, కృష్ణారెడ్డి, వంశీనాథ్‌, సీతారామిరెడ్డి తదిరులు తనిఖీలు చేపట్టారు. ప్యాపిలి మండలం మెట్టుపల్లె గ్రామానికి చెందిన సుబ్బన్న కుమారుడు చంద్రుడు ఫిర్యాదు మేరకు అధికారులు ఈ చర్యకు ఉపక్రమించారు.

మెట్టుపల్లెకు చెందిన సుబ్బన్న తన పొలంలో పట్టు పరిశ్రమ షెడ్డు ఏర్పాటు చేసుకునేందుకు పట్టు పరిశ్రమ శాఖ, ఉపాధి హామీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. 2019లో పట్టు పరిశ్రమ శాఖ నుంచి షెడ్డు ఏర్పాటుకు రూ.8.50 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో పట్టు పరిశ్రమ శాఖ అధికారులు రూ.3 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. రూ.5.50 లక్షలు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద రావాల్సి ఉందన్నారు. వాటిలో 2020 అక్టోబరులో రూ.3.15లక్షలు మంజూరయ్యాయన్నారు.

మిగతా నిధులు రావాల్సి ఉండగా.. వీటిని మంజూరు చేసేందుకు ఎంపీడీవో ఫజుల్‌రహిమాన్‌, ఏపీవో వెంకటేశ్వర్లు, ఈసీ నాగమునికుమార్‌ 9 శాతం లంచం ఇవ్వాలని అడిగినట్లు బాధితుడు స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుతో పాటు, మండలంలో ఉపాధిహామీకి సంబంధించి పనుల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారించేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు.

వీటితో పాటు ఎంపీడీవో కార్యాలయంలోని పలు దస్త్రాలను తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు చేపట్టడంతో పలు శాఖల అధికారుల్లో గుబులు రేకెత్తింది. ఈ తనిఖీలు కేవలం ఎంపీడీవో, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కార్యాలయాలకే పరిమితం అవుతాయా, లేక ఇతర శాఖలపైనా ఏమైనా ఫిర్యాదులు అందాయా అనేది అధికారుల్లో ఆందోళన మొదలైంది.

ఇదీ చదవండి: గాయత్రి గోశాల వద్ద అగ్నిప్రమాదం..బూడిదైన పశుగ్రాసం

ABOUT THE AUTHOR

...view details