ఆకర్షణీయమైన పథకాలు చెప్పి వందలాది మంది ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి.... పత్తా లేకుండా పోయాడు ఓ వ్యాపారి. కర్నూలు జిల్లా నంద్యాలలో కార్లు, బైక్‌లు అమ్మే సంస్థ జేవీసీ ఎంటర్‌ప్రైజస్ యజమాని మనోహర్.... లక్కీ డిప్ స్కీమ్ అంటూ తమను మోసం చేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు.
లక్కీడిప్ పేరుతో వసూళ్లు... రూ. 8 కోట్లతో పరార్
లక్కీడిప్ స్కీమ్ అంటూ ప్రజల నుంచి డబ్బలు దండుకున్నాడు ఓ మోసగాడు. కార్లు, బైకులు ఎరగా చూపి మభ్యపెట్టాడు. సుమారు 8 కోట్ల రూపాయలు వసూలు అయ్యాక పత్తా లేకుండా పరారయ్యాడు.
ద్విచక్రవాహనం కావాలంటే నెలకు 2 వేలు చొప్పున 30 నెలలు, కారు కావాలంటే నెలకు 10 వేల చొప్పున 40 నెలలు చెల్లించాలని మనోహర్ చెప్పాడని తెలిపారు. మధ్యలో తీసే లక్కీడిప్‌లో ఎవరి పేరు వస్తే వారు..... ఇక మిగతా డబ్బు చెల్లించకుండానే వాహనాన్ని సొంత చేసుకోవచ్చని నమ్మబలికాడు. వందలాది మంది సభ్యులు ఈ పథకం కింది డబ్బు కడుతూ వచ్చారు.
కోట్ల రూపాయలు దండుకున్నాక మనోహర్ కనిపించకుండా పోయాడు. కొందరికి చెల్లని చెక్కులు ఇవ్వడంతో పోలీసులను ఆశ్రయించారు. సుమారు 8 కోట్ల రూపాయల మేర వసూళ్లు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి, తహసీల్దార్ రమేష్ బాబు ఆధ్వర్యంలో జేఏసీ ఎంటర్‌ప్రైజస్ కార్యాలయం తాళాలు పగులగొట్టి అక్కడి దస్త్రాలను పరిశీలించారు. నిందితుణ్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు.