ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్లె సీమలను పచ్చగా మార్చేందుకు 71వ వనమహోత్సవం

పల్లె సీమలను పచ్చగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్న పచ్చతోరణం' కార్యక్రమం కృష్ణా జిల్లాలో ప్రారంభం కానుంది . 71వ వనమహోత్సవంలో భాగంగా ఇబ్రహీంపట్నం సమీపంలో పేద ప్రజలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో సీఎం జగన్ మొక్కలు నాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రతిఒక్కరూ పది మొక్కలు నాటాలనే నినాదంతో ప్రారంభిస్తున్న కార్యక్రమం కేవలం నినాదాలతో మిగిలిపోకూడదు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ లక్ష్యసాధనకు నడుం బిగించాల్సిన అవసరముంది.

Vanamahosthavam will be start in Ibrahimpatnam today
జగనన్న పచ్చతోరణం

By

Published : Jul 22, 2020, 1:23 AM IST

పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిష్టాత్మకంగా జగనన్న పచ్చతోరణం కార్యక్రమం చేపడుతున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏటా వర్షాకాలంలో జరిగే తంతుగానే దీన్ని పరిగణిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న అటవీ విస్తీర్ణం తక్కువ. అందులోనూ అధికశాతం ఆక్రమణలకు గురైంది. ఈ నేపథ్యంలో అధికారులు చిత్తశుద్ధి చూపితేనే ముఖ్యమంత్రి అనుకున్న లక్ష్యం నెరవేరనుంది. కొన్నేళ్లుగా పాఠశాలలు, చెరువు గట్లు, పల్లెలు, సామాజిక ప్రాంతాలు, తదితర చోట్ల నాటిన మొక్కలు ఎండిపోయాయి. వీటికి జియో ట్యాగింగ్ చేస్తామని చెప్పినా అమలు కాలేదు.

చిన్నారుల ఆసక్తి ఉన్నచోటే ప్రతిఫలం...

పిల్లలు ఆసక్తి చూపించిన పాఠశాలల్లో మొక్కలు బాగా పెరుగుతున్నాయి. మిగిలిన చోట్ల ఎండిపోయాయి. ఉపాధి హామీ పథకం కింద నాటిన మొక్కల పోషణకు నిధులు వస్తాయి. ఇవి సక్రమంగా రాక పోషకులు పట్టించుకోవడం మానేస్తున్నారు. పశ్చిమ కృష్ణాలోని మైలవరం, నూజివీడు, తిరుపూరు, జగ్గయ్యపేట వంటి చోట్ల నీటి కొరత అధికంగా ఉంది. ఫలితంగా మొక్కలు ఎండిపోతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని లక్ష్యం విధించారు. ఇది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు.

లెక్కలే... మొక్కలు లేవు..!

గత మూడేళ్లలో అప్పటి ప్రభుత్వం జిల్లాలో 2.50 కోట్ల మొక్కలను నాటినట్లు లెక్కలు చెబుతున్నాయి. హెలికాప్టర్ ద్వారా ఆటవీ ప్రాంతంతో, కొండలు, గుట్టల్లోనూ విత్తనాలు చల్లినట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇవి ఎక్కడా కనిపించడం లేదు. ఈసారైనా అధికారులు శ్రద్ధ పెడితేనే ముఖ్యమంత్రి జగన్ ఆనుకున్న లక్ష్యం నెరవేరనుంది. జిల్లాలోని మొత్తం 980 పంచాయతీల్లోని రహదారుల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల్లో నాటాలని నిర్ణయించారు. ఇందుకోసం అటవీ, ఉద్యాన నర్సరీల్లో 15,13,892 మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొత్తం 971 గ్రామ పంచాయతీల పరిధిలో 1972 కిలోమీటర్ల మేర 7,76,800 మొక్కలు నాటనున్నారు.

అన్నింటా మొక్కలే ఉండాలి...

16 వేల గ్రామ వాలంటీర్ల ద్వారా ఒక్కొక్కరు పది మొక్కలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం 9710 ఎకరాల్లో ప్రజలకు ఇళ్ల స్థలాల కాలనీలు ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. వీటిలో సామాజిక అవసరాల కోసం వదిలిన కామన్ సైట్ 185 ఎకరాల్లో మొక్కలు నాటనున్నారు. దీంతోపాటు సామాజిక భవనాలు, శ్మశాన వాటికలు, ప్రభుత్వ, రైల్వే స్థలాలు, దేవాదాయ భూముల్లోనూ నాటనున్నారు. ఇన్​స్ట్యూషనల్ ప్లాంటేషన్​లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటనున్నారు.

ఇదీ చదవండీ...

విద్యార్థుల్లో 'లెర్న్​ టు ఎర్న్'​కు నాంది పడాలి: సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details