ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక వ్యాపారంలో ఎక్కడో చెడింది.. టర్న్​కీ, టర్న్ అవుతోంది - Turnaki Run away from sand business

Turnaki sand business in ap: రాష్ట్రంలో ఇసుక రంగం పిల్లిమొగ్గలు వేస్తోంది. నువ్వొస్తానంటే..నేనొద్దంటానా , అనే రీతిలో వ్యవహారాలు నడుస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్న ఇసుక అమ్మకాలు..ప్రస్తుతం మరో మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఇసుక అమ్మకాలతో వైకాపా నేతలు కోట్లు వెనుకేసుకుంటున్నరని.. విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇసుక ఉచితంతో కాదు, అమ్మకాలతో ప్రజలకు సంక్షేమం అందిస్తామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఇసుక అమ్మకాలపై ఇప్పటికే అనేక విధానాలను తెరపైకి తెచ్చింది. తాజాగా, గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో, ఇసుక అమ్మకాలలో ఉపగుత్తేదారుగా ఉన్న టర్నకీ సంస్థ ..ఈ ఇసుక నుంచి వైదొలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.

sand
sand

By

Published : Sep 11, 2022, 8:45 AM IST

Updated : Sep 11, 2022, 12:37 PM IST

Sand business in AP : రాష్ట్రంలో ఇన్నాళ్లూ తెరవెనుక ఉంటూ ఇసుక దందా నడిపిన అధికార పార్టీ నేతలు.. ఇప్పటి నుంచి నేరుగా బరిలోకి దిగనున్నారు. అధికార పార్టీ నేతల దెబ్బకు ఉపగుత్తేదారుగా ఉన్న టర్న్‌కీ సంస్థ తమవల్ల కాదంటూ చేతులెత్తేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరుపుతున్న టర్న్‌కీ ప్రభుత్వ పెద్దలతో కుదుర్చుకున్న లావాదేవీల్లో ఎక్కడో వ్యవహారం బెడిసికొట్టడంతో.. శనివారం నుంచి పూర్తిగా వైదొలిగినట్టు సమాచారం. టర్న్‌కీ సంస్థ కొనసాగేలా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఒప్పించేందుకు.. చెన్నైకి చెందిన ఓ మైనింగ్‌ వ్యాపారి చేసిన ఆఖరి ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలిసింది. ఇసుక వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. టర్న్‌కీకి బదులుగా మరో సంస్థను ఉపగుత్తేదారుగా తెరపైకి తెచ్చారు. పేరుకే ఆ సంస్థ ఉపగుత్తేదారు తప్ప ఇసుక విక్రయాలు, లావాదేవీలన్నీ ఇకపై ఆయా జిల్లాల్లోని కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, వారి సన్నిహితుల ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.

sand

2021ఇసుక వ్యాపారాన్ని దక్కించుకున్నజయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థ:రాష్ట్రంలో ఇసుక వ్యాపారాన్ని జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ సంస్థ 2021 మార్చిలో దక్కించుకుంది. ఆ సంస్థ తరఫున ఉపగుత్తేదారుగా టర్న్‌కీ సంస్థ మొత్తం వ్యవహారం నడిపిస్తోంది. ఆన్‌లైన్ వే బిల్లులు లేకుండా , కేవలం ముద్రిత బిల్లుతోనే ఇన్నాళ్లూ దందా సాగించింది. ఇప్పుడు టర్న్‌కీ తప్పుకోవడంతో.. వివిధ జిల్లాల్లో ఇసుక నిల్వ కేంద్రాలను ఇప్పటికే అధికార పార్టీ నాయకులు స్వాధీనంలోకి తీసుకున్నారు. సోమవారం నుంచి వారే అనధికారికంగా విక్రయాలు జరపనున్నట్లు సమాచారం.

ఇసుక వ్యాపారంలోకి వైకాపా నేతల బంధుగణం:ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా కీలక నేత, వైఎస్సార్​ జిల్లాలో సీఎం జగన్ బంధువు, అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో వైకాపా టిక్కెట్‌ ఆశించిన నాయకుడు ఇసుక వ్యాపారం దక్కించుకున్నట్లు తెలిసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లాలో ఓ ఎమ్మెల్యే దగ్గరి బంధువు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు 10 నుంచి 15 శాతం వాటాలతో భాగస్వాములుగా చేరారని చెబుతున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో స్థిరాస్తి వ్యాపారిగా పేరొందిన, కృష్ణా నదికి ఆనుకొని ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఇసుక వ్యాపారాన్ని దక్కించుకున్నట్టు తెలిసింది. అదే జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, విజయవాడకు చెందిన యువనేత ఇందులో భాగస్వాములైనట్లు సమాచారం. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ కొందరు నేతలు ఇసుక ఉప గుత్తేదారులుగా అవతారమెత్తినట్లు తెలిసింది. టర్న్‌కీకి ఉన్న నిబంధనలే వీరంతా అమలు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు చెబుతున్నారు. ఇంతకుముందే అనధికారికంగా పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణా సాగుతుండగా... ఇప్పుడు అధికార పార్టీ నాయకులే స్వయంగా రంగంలోకి దిగడంతో ఇసుక దందాకు హద్దే లేకుండా పోయే అవకాశం ఉందని మైనింగ్ వర్గాలు అంటున్నాయి.

టర్న్​కీని కొనసాగించేందుకు ప్రయత్నాలు చేసిన చెన్నైకి చెందిన మైనింగ్‌ వ్యాపారి:ఉప గుత్తేదారుగా టర్న్‌కీ కొనసాగాలా, వైదొలగాలా అనే విషయమై మూడు రోజులుగా హైదరాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో కీలక చర్చలు జరిగినట్లు తెలిసింది. ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించే ప్రజాప్రతినిధి,చెన్నైకు చెందిన కీలకమైన మైనింగ్‌ వ్యాపారి తదితరులు వీటిలో పాల్గొన్నారు. ఆయా జిల్లాల్లో అనధికారిక ఉపగుత్తేదారులుగా రంగప్రవేశం చేయనున్నవారు సైతం కీలక ప్రజాప్రతినిధితో హోటల్‌లో చర్చలు జరిపి, తామే ఇసుక వ్యవహారాలు చూస్తామని అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. దీంతో 110 నిల్వ కేంద్రాల్లో 60 లక్షల టన్నుల ఇసుక నిల్వలు వీరిపరం కానున్నాయి. టర్న్‌కీలో ఇంతకాలం పశ్చిమగోదావరి జిల్లా బాధ్యతలు చూస్తున్న ఓ ఇసుక వ్యాపారి.. ఇప్పుడు ఏకంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరితోపాటు, పశ్చిమగోదావరి జిల్లా బాధ్యతలు తీసుకున్నారు. పెద్దస్థాయిలో లాబీయింగ్‌ చేసి 5 జిల్లాలను చేజిక్కించుకున్న వ్యాపారి ప్రతిఫలంగా, ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధుల ఆర్థిక అవసరాల్ని తానే చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 11, 2022, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details