ఆర్థిక సాయం పథకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ యజమానులకు ప్రభుత్వ తరపున ఆర్థిక సాయం అందించేందుకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌తోపాటు నేరుగానూ దరఖాస్తు చేసుకోవచ్చన్న ప్రకటనతో రవాణా కార్యాలయాలకు వాహనాల యజమానులు క్యూ కట్టారు. ఈ పథకాన్ని తమకూ వర్తింపజేయాలని కిరాయి డ్రైవర్లు కోరుతున్నారు.
పదివేల రూపాయల ఆర్థిక సాయమందించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ట్యాక్సీ, ఆటోల యజామానుల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు గడువు విధించగా రవాణా కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు చేసుకుంటున్నారు. తొలిరోజు ఈ పథకానికి మొత్తం 14,100 దరఖాస్తులు వచ్చాయి. 9,100 మంది లబ్దిదారులు ఆన్లైన్ ద్వారా, దాదాపు 5 వేల మంది వరకు వివిధ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేస్తుకున్నారు. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులో అధిక మొత్తం బీమాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, మరమ్మతులకే ఖర్చు పెడుతున్న తమకు ఈ పథకం వల్ల కొంతైనా ఆసరా లభిస్తుందని డ్రైవర్లు చెబుతున్నారు.
కిరాయి డ్రైవర్ల అసంతృప్తి
పథకం వర్తింపునకు ట్యాక్సీ లేదా ఆటో యజమాని సొంతగా వాహనం నడుపుతూ ఉండాలని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొంది. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులు ఉండాలని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం కేవలం వాహనాల యజమానులకే లాభం చేకూర్చేలా ఉందని కిరాయి డ్రైవర్లలో ఆవేదన వ్యక్తమవుతోంది. నిబంధనలు సవరించి ఏళ్లుగా డ్రైవర్లుగా పనిచేస్తున్న తమనూ ఆదుకోవాలని కోరుతున్నారు. బీమా మొత్తాన్ని తగ్గించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని లబ్దిదారులు చెబుతున్నారు. దరఖాస్తు గడువు తేదీ పెంచాలని కోరుతున్నారు.