విజయవాడలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. మత్తుకు బానిసైన కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలైన మారేడుమిల్లి, అడ్డతీగల, సీలేరు తదితర ప్రాంతాల నుంచి బస్తాల్లో గంజాయిని తీసుకువస్తుంటారు. అడవుల్లో పండిన పంటను కోసి ఎండబెట్టి ఆ తర్వాత దాన్ని పొరపొరలుగా చేసి ప్యాకింగ్ చేస్తారు. వీటిని సూట్‌కేసుల్లో సరుద్దుతారు. బాక్సుల్లో కడతారు. ఆ తర్వాత వాటిని బస్సులు, లారీల ద్వారా పార్శిల్ చేస్తారు. ప్రస్తుతం రైలు మార్గం సక్రమంగా లేకపోవడంతో విజయవాడకు జాతీయ రహదారిపై నుంచి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ ఏజెన్సీ, ఖమ్మం జిల్లా అడవుల నుంచి రవాణా అవుతోందని పోలీసులు చెబుతున్నారు.
అయితే గంజాయి ఘాటైన వాసన వస్తుంది. పోలీసులు దీన్ని సులభంగా గుర్తు పడతారు. దీంతో గంజాయి ముఠాలు.. ప్యాకింగ్‌ను పకడ్భందీగా చేస్తున్నాయి. గాలి చొరబడకుండా మందపాటి ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేస్తారు. దీనికి మంచి సుగంధాన్ని వెదజల్లే అత్తరు, సెంటు, పౌడర్ పూసి సరఫరా చేస్తారు. గమ్యం చేరిన తరువాత ఈ బ్యాగ్‌ను విడదీసి పొట్లాలు కట్టి కిలోలుగా అమ్మేస్తారు.
యువత పెడదోవ..
తక్కువ సమయంలో ఎక్కువమొత్తంలో సంపాదించవచ్చనే దురాశతో.. యువత పెడదోవ పడుతున్నారు. బయట నుంచి తెచ్చుకున్న గంజాయిని చిన్న పొట్లాలు కట్టి విక్రయిస్తున్నారు. ఒక పొట్లం రెండు సిగరెట్లలో కూర్చడానికి సరిపోతోంది. ఒక్కో పొట్లం ధర 50రూపాయల వరకు ఉంటుంది. కిలో గంజాయిని విక్రయిస్తే 6 నుంచి 7వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది.