తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపుమేరకు రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరతపై పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎవరికి వారు తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లోనూ ఆందోళనలు కొనసాగించారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తేనే ప్రజల ప్రాణాలు నిలుస్తాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇబ్బంది పడే ప్రజల పట్ల ప్రేమలేని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారని మండిపడ్డారు. ప్రజల పక్షాన తమ పోరాటమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో టెస్టుల సామర్థ్యమూ పెంచాలని డిమాండ్ చేశారు. నాయకత్వ లోపం, అనర్హులకు పదవులు కట్టపెట్టడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు క్యూ.. వ్యాక్సిన్ల కేంద్రాల వద్ద తోపులాటా?: లోకేశ్
కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకోవటం తగదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు దుయ్యబట్టారు. చంద్రబాబు మంచి సలహాలు ఇస్తుంటే ఆయనపై కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని ఆక్షేపించారు. వ్యాక్సిన్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. కరోనా కట్టడికి సూచనలిస్తున్న చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ధ్వజమెత్తారు. బెయిల్ రద్దవుతుందనే భయంతోనే జగన్ రెడ్డి కేంద్రానికి పాదాభివందనాలు చేస్తున్నారని బండారు విమర్శించారు.