దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆశ్వయుజ పాడ్యమి మొదటిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తోంది.
ఘనంగా ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి విశిష్టత...
శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అవతారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారు కవచం ధరించి.. సువర్ణ కాంతులీనుతూ భక్తులకు దర్శనమిస్తుందా తల్లి. బంగారు వర్ణం గల చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే సమస్త దారిద్య్రబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. దుర్గా సప్తశ్లోకీ, సప్తశతి పారాయణం చేయడం శుభధాయకమని వేదాలు చెబుతున్నాయి.
మొదటిరోజు నైవేద్యం
దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో రూపం ఉన్నట్లే...నైవేద్యం కూడా ప్రతీరోజు ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మవారికి ఆశ్వయుజ పాడ్యమి మొదటిరోజు పాలు, అన్నం కలిపిన పదార్థాన్ని నివేదిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని పండితులు చెబుతున్నారు.