ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సుజనా

సీబీఐ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరినా సీబీఐ పక్కన పెట్టారని తెలిపారు. రుణం తీసుకున్న కంపెనీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తనపై 2017లో సీబీఐ కేసు నమోదు చేసినట్లు నోటీసులు ద్వారా తెలిసిందని వివరించారు.

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సుజనా

By

Published : Apr 30, 2019, 6:59 AM IST

తెలుగుదేశం ఎంపీ సుజనాచౌదరిపై 2017లో నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​కు సంబంధించిన దర్యాప్తులో భాగంగా స్టేట్​మెంట్​ ఇవ్వడానికి మే 2న హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22, 27న జారీ చేసిన నోటీసులకు ఆయన సోమవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు నోటీసులు ఎందుకు ఇచ్చారో, వాంగ్మూలం ఎందుకివ్వాలో అర్థం కావడం లేదన్నారు. చెన్నైకి చెందిన బెస్ట్​ అండ్​ క్రాంప్టన్​ ఇంజనీరింగ్​ ప్రాజెక్ట్స్​ లిమిటెడ్​, దాని అధికారులతో తనకెలాంటి సంబంధం లేదని తెలిపారు. తనపై 2017లో సీబీఐ కేసు నమోదు చేసినట్లు నోటీసుల ద్వారా తెలిసిందని వివరించారు. కొత్త ప్రాజెక్టు పేరుతో రుణం తీసుకుని నిధుల కొరతతో ప్రాజెక్టు పూర్తి చేయలేదని, నిధులను తప్పుడు ఖాతాల్లోకి తరలించారని కేసు నమోదైందని చెప్పారు. కేవలం ఖాతాల్లో అమ్మకాలు, కొనగోలు చూపి బ్యాంకులను రూ. 71.46 కోట్ల మేర మోసం చేశారని ఆరోపించారని తెలిపారు. 2010-13 మధ్య లావాదేవీలు జరగ్గా... 2017లో కేసు నమోదైందని చెప్పారు. ఈ కేసు కేవలం రుణం తీసుకోడానికి సంబంధించిన అంశమేనని, చెల్లింపులకు చెందినది కాదని పేర్కొన్నారు. రుణం తీసుకున్న కంపెనీతో ఎలాంటి సంబంధం లేని తనకు నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధం, అధికార దుర్వినియోగమని పేర్కొన్నారు. రాజకీయ నేతగా, పారిశ్రామికవేత్తగా ఉన్న తనపై బురద జల్లి ప్రతిష్ఠను దెబ్బతీయాలన్న దురుద్దేశంతో ఈ సమన్లు జారీ చేశారని సుజనా ఆరోపించారు. నోటీసులు ఉపసంహరించుకోవాలని అభ్యర్ధించినా... సీబీఐ దానిని పరిగణనలోకి తీసుకోకుండా మే 4న హాజరు కావాలని నిర్ణయించడం సబబు కాదని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details