జగన్ మోహన్ రెడ్డి బెదిరింపులకు శిద్దా రాఘవరావు లొంగిపోయి పార్టీ మారారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఏడాది పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టి మళ్లించడానికే సీఎం జగన్ ఫిరాయింపులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శిద్దా రాఘవరావుకు సంబంధించిన మైన్స్‌లో అక్రమాలు జరిగాయని నోటీసులు ఇచ్చిన విషయం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. నాయకులను లొంగదీసుకుని వైకాపాలో చేర్చుకున్న తర్వాత అక్రమాలన్నీ సక్రమాలు అయిపోతాయా అని నిలదీశారు. జగన్ ఈ రకమైన బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయటం, ఆస్తులు విధ్వంసం చేయడం ద్వారా తాత్కాలిక ప్రయోజనం పొందొచ్చునేమో గానీ ప్రజలు మాత్రం ఉపేక్షించరని హెచ్చరించారు.
శిద్దా రాఘవరావును తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా గౌరవించిందని వర్ల గుర్తు చేశారు. ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీకి, ప్రకాశం జిల్లా తెదేపా కార్యకర్తలకు, ప్రజలకు శిద్దా సంజాయిషీ చెప్పుకోవాల్సిన స్థితికి వెళ్లారని ఆక్షేపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపుల గురించి ప్రగల్భాలు పలికిన జగన్ మోహన్ రెడ్డి... ఇప్పుడు మాట తప్పుతున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు.