రాష్ట్ర ప్రభుత్వం వచ్చే జనవరి నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. రేషన్ సరకుల పంపిణీకి అవసరమైన వాహనాలను కూడా ప్రభుత్వమే వివిధ కార్పొరేషన్‌ల ద్వారా అందించాలని నిర్ణయించింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. నవంబరు 20 నుంచి 27వ తేదీ వరకు ఆయా సామాజికవర్గ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఔత్సాహికుల నుంచి వేల సంఖ్యలో అర్జీలు వచ్చాయి. వారందరికీ ఈనెల 4న మౌఖిక పరీక్షలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రూ.3.48లక్షలు రాయితీ ఉండటంతో ఎక్కువమంది వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయా కార్పొరేషన్‌ల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఎక్కువ శాతం ఎస్సీ, బీసీల ద్వారా వేలాది దరఖాస్తులు వచ్చాయి.
పోటా పోటీ..
రాయితీపై వాహనం పొందడమే కాకుండా రేషన్ సరకులను ఇళ్లకు చేర్చడం ద్వారా ఉపాధి కూడా పొందవచ్చన్న కారణంతో నిరుద్యోగ యువత ఎక్కువమంది వీటికోసం పోటీ పడుతున్నారు. అధికార, నాయకుల సిఫార్సులు ఉన్న వారికే వాహనాలు దక్కుతాయన్న ప్రచారం సాగుతోంది.
మౌఖిక పరీక్షలు పూర్తి...
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రాంతాలకు వాహనాలు అందించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది . జిల్లావ్యాప్తంగా 2,353 రేషన్ డిపోలు ఉండగా పరిధిలోని 13.45 లక్షల కార్డులున్నాయి. ఇంటింటికీ బియ్యంతోపాటు ఇతర సరకులు చేరవేయనున్నారు. దీనికోసం జిల్లాలో మండలాలవారీగా ట్రక్కులు కేటాయించారు. వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను మౌఖిక పరీక్షలు నిర్వహించి అధికారులు అర్హులను ఎంపిక చేశారు. ఆయా మండల పరిషత్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయ ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ...అర్హులను గుర్తించారు .