''రాష్ట్ర సమాచార కమిషనర్ నియామకం చెల్లదు''
ఇటీవలే రాష్ట్ర సమాచార కమిషనర్గా ఐలాపురం రాజా నియమితులయ్యారు. వ్యాపారస్థుడైన ఆయనను ఈ పదవికి నియమించడం చట్ట వ్యతిరేకమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్గా ఐలాపురం రాజా నియామకం వివాదాస్పదమైంది. ఆయన నియామకం చెల్లదంటూ జన చైతన్యవేదిక అధ్యక్షులు లక్ష్మారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 50 లోని క్లాజ్ 3 నిబంధనలు ఉల్లంఘించి ఐలాపురం రాజాని నియమించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సెక్షన్ 15 క్లాజ్ 6 ప్రకారం సమాచార కమిషనర్ గా వ్యాపారస్థుల్ని నియమించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. ఐలాపురం రాజా నియామకాన్ని రద్దుచేయాలని విన్నవించారు. వాదనలు విన్న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణను ఈ నెల 29 కి వాయిదా వేసింది. అదే రోజున కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.