అమ్మవారి ఆలయంలో ఊరేగింపులు జరిగినప్పుడు తీసుకెళ్లే వస్తువులను తిరిగి అదే స్థితిలో తీసుకొచ్చి పెట్టారా.. రథాలకు మరమ్మతులు ఏమైనా వచ్చాయా.. అనేది కచ్చితంగా పరిశీలించాక యథాస్థానంలో పెట్టాలి. వీటన్నింటినీ ఆలయ స్తపతి చూసుకుంటారు. దుర్గగుడికి గతంలో ఉన్న స్తపతి రామబ్రహ్మం రెండేళ్ల క్రితం చనిపోయారు. ఆ తర్వాత ఎవరినీ నియమించలేదు. సహాయ స్తపతిగా పొరుగుసేవల వ్యక్తితో నెట్టుకొస్తున్నారు. తాత్కాలిక ఉద్యోగులకు అంత బాధ్యత ఉండదు. ప్రస్తుతం ఆలయంలో అది కొరవడింది. దీనికితోడు ఆలయానికి అసిస్టెంట్ శిల్పి, పాలిషర్ పోస్టులు మంజూరై ఉన్నాయి. ఆలయ అసిస్టెంట్ శిల్పి పదేళ్ల క్రితం చనిపోయారు. పాలిషర్ పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఈ రెండు పోస్టులు భర్తీ చేయలేదు. ప్రస్తుతం రథం విషయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడానికి ఇది ఓ ప్రధాన కారణమే.
దుర్గగుడికి చెందిన క్యాడర్ స్ట్రెంత్‌లో స్తపతి, అసిస్టెంట్ శిల్పి, పాలిషర్ ఈ మూడు శాశ్వత పోస్టులు ఉన్నాయి. ఆలయానికి చెందిన నిర్మాణాల విషయంలోనూ, రథాలు, ఆభరణాలు, ఇతర శిల్పాలకు సంబంధించిన అన్ని విషయాలపై ఈ ముగ్గురి పర్యవేక్షణ, అవగాహన ఉండాలి. దశాబ్దాల క్రితమే ఈ మూడు పోస్టుల అవసరాన్ని గుర్తించి క్యాడర్ స్ట్రెంత్‌లో కేటాయించారు. ఈవోల నిర్లక్ష్యం వల్ల పాతవాళ్లు పోయిన తర్వాత కొత్త వారిని భర్తీ చేయలేదు.
శాశ్వత ఉద్యోగులు ఉంటే...
స్తపతి, శిల్పి, పాలిషర్ ఈ ముగ్గురు శాశ్వత ఉద్యోగులు ఉంటే కచ్చితంగా రథం విషయంలో ఇంత నిర్లక్ష్యం ఉండేది కాదు. వీరిని నియమిస్తే ఆలయంపై భారీ స్థాయిలో పడే భారం కూడా లేదు. అందుకే ప్రస్తుతం రథానికి ఉన్న మూడు సింహాల దొంగతనం జరిగిందనేది తెలిసినా ఎప్పుడు చేశారనే విషయంలో నాలుగు రోజులైనా స్పష్టత లేదు. ఎందుకంటే గత ఉగాదికి మూసేసిన తర్వాత ఇంతవరకూ ఆలయ సిబ్బంది కనీసం అటువైపు చూసింది లేదు. ప్రస్తుతం పోలీసులకు ఇదే పెద్ద సవాలుగా మారబోతోంది. అసలు ఎప్పుడు చోరీ జరిగిందనేది తెలుసుకోవడమే కష్టంగా మారింది.