ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వానరానికి మనిషి సహాయం..

తల్లి ప్రేమ ఎవరిలోనైనా ఒకేలా ఉంటుంది. మనషులైనా, జంతువులైనా, పక్షులైనా అమ్మకి బిడ్డ అపురూపమే. అలాంటి కన్నపేగుకు కష్టమొస్తే ఆ తల్లి మనసు విలవిలలాడిపోతుంది. బిడ్డ కష్టాన్ని తీర్చేందుకు ఎంతకైనా తెగిస్తుంది. విద్యుత్ తీగల్లో చిక్కుకున్న బిడ్డ.. ఎలాగైనా కాపాడాలని తపించిందా తల్లి. చేసిన ప్రయత్నాలు విఫలమై గుండె పగిలే రోదనతో అరుస్తూ ఆవేదనకు గురైందా కొండముచ్చు. తానున్నానంటూ మనిషి స్పందించాడు. ఆ పిల్ల కొండముచ్చు ప్రాణం నిలిచింది. మృత్యువు అంచులను తాకి బయటపడ్డ బిడ్డను ఆత్రంగా అక్కున చేర్చుకుందా తల్లి. బిడ్డ ప్రాణాలు కాపాడిన మానవత్వానికి మూగగా... కళ్లతో కృతజ్ఞత చెప్పుకుంది.

monkey-story-nandigma-krishna-district
వానరానికి మనిషి సహాయం

By

Published : Mar 1, 2020, 10:08 AM IST

వానరానికి మనిషి సహాయం

కృష్ణా జిల్లా నందిగామ స్థానిక సబ్​రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర శనివారం కొండముచ్చులు ఇళ్లపై నుంచి దూకేస్తూ.. గోడలు పాకేస్తూ.. స్తంభాలు ఎక్కేస్తూ గుంపుగా వెళ్తున్నాయి. అంతలో ఓ బుజ్జి కొండముచ్చు విద్యుత్ తీగల్లో చిక్కుకుంది. విద్యుదాఘాతానికి గురై విలవిలలాడుతోంది. బిడ్డను కాపాడుకోవాలని తల్లి ఎంతో తపించింది. కష్టపడి కింది నుంచి లాగేందుకు ప్రయత్నించింది. అయినా ఫలితం లేకపోయింది. కిందకు దిగి దీనంగా, ఆవేదనగా కూర్చుంది.

పరిమళించిన మానవత్వం

అంతలో స్థానికులు గమనించి, విద్యుత్తు ఉద్యోగులకు సమాచారం అందించారు. సీపీడీసీఎల్ పట్టణ ఏఈ దిబ్బయ్య సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అతికష్టం మీద పిల్ల కొండముచ్చును కాపాడారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరిన దానిని పశువైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు వెంటనే ఇంజక్షన్లు చేసి చికిత్స అందించారు. తేరుకున్న పిల్లను తీసుకొచ్చి గుంపులో కలిపారు. అప్పటిదాకా అక్కడే గోడపై కూర్చుని ఆవేదనతో ఎదురుచూసిన తల్లిలో కొండంత ఆనందం. వెంటనే వచ్చి బిడ్డను తనివితీరా గుండెలకు హత్తుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికుల కళ్లలో సంతోషం వెల్లివిరిసింది.

ఇవీ చదవండి..బార్బిక్యూ రైడ్​...ఆహార ప్రియులకు ఓ సరికొత్త ట్రెండ్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details