నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యాశాఖ వచ్చే విద్యా సంవత్సరం నుంచి 5+3+3+4 విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషనల్ బడులుగా మార్పు చేస్తారు. అంగన్‌వాడీలు వైఎస్సార్ ప్రీప్రైమరీ పాఠశాలలుగా మారతాయి. ప్రాథమిక బడులకు సమీపంలో ఉన్న అంగన్‌వాడీలను పాఠశాలల్లో కలిపేసి, ప్రీప్రైమరీ-1, 2, ఒకటో తరగతికి సన్నద్ధత, ఒకటి, రెండు తరగతులు నిర్వహిస్తారు.
ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలిపేస్తారు. దీంతో వీరందరూ అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. సెకండరీ పాఠశాల 3 కిలోమీటర్లలో ఉంటుందని ప్రతిపాదనల్లో అధికారులు పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుంచి 5 తరగతుల ప్రాథమిక పాఠశాల కిలోమీటరు, ప్రాథమికోన్నత బడి మూడు, ఉన్నత పాఠశాల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండాలి. ఇందుకు విరుద్ధంగా 3, 4, 5 తరగతులు చదివే వారిని మూడు కిలోమీటర్ల వరకు పంపించడమేంటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని కోటితీర్థం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 31మంది ఉండగా3,4,5 తరగతులు చదివేవారు 17మంది ఉన్నారు. కొత్త విధానం ప్రకారం వీరు ఐదు కిలోమీటర్ల దూరంలోని జిల్లాపరిషత్తు టీకేపాడుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది విద్యార్థులకు పాఠశాలను మరింత దూరం పెంచుతుంది. ఈ మండలంలోని 52 పాఠశాలలను మార్పు చేయడం వల్ల అర్థ కిలోమీటరు నుంచి.. 6కిలోమీటర్ల దూరం పెరగనుంది.