రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నాదేళ్లవారిపాలెంలో శ్రీవనమలమ్మ తల్లి ఆలయాన్ని ఆయన సందర్శించారు. హుండీ చోరీపై ఆరా తీశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా... నిందితులను పట్టుకోవటంలో పోలీసు శాఖ వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు.
ఆదాయం లేని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వమే దేవాలయాల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 18 నెలలుగా గుర్తుకు రాని ఆలయ పునర్నిర్మాణ అంశం ఇప్పుడే సీఎం జగన్కు గుర్తుకు వచ్చిందా అని బుద్ధప్రసాద్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కులమతాల ప్రస్తావన తెచ్చింది జగనే అని మండిపడ్డారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎస్ఈసీకి కులం ఆపాదించారని.. కేసు పెట్టాలంటే మెుదటగా ముఖ్యమంత్రిపైనే పెట్టాలని అన్నారు.